గుంటూరులో సంచలనం.. జనసేన నేత హత్యకు భారీ కుట్ర..!
గుంటూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ జనసేన పార్టీ కీలక నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను హతం చేసేందుకు జరిగిన ఒక భారీ కుట్ర వెలుగుచూసింది. వైఎస్సార్సీపీ(YSRCP) నాయకుడు నరేంద్ర రెడ్డి, ఒక రౌడీషీటర్‌తో కలిసి ఏకంగా ₹1.5 కోట్ల రూపాయలకు శ్రీనివాస యాదవ్ హత్యకు సుపారీ మాట్లాడినట్లు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ హత్య పథకం విఫలమై, కుట్ర బయటపడటంతో పోలీసులు వైసీపీ నేత నరేంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. బోనబోయిన శ్రీనివాస యాదవ్ ప్రతిరోజూ ఉదయం జిమ్‌కు వెళ్లే సమయాన్ని ఆసరాగా చేసుకుని ఆయనపై దాడి చేసి మట్టుబెట్టాలని నిందితులు వ్యూహం రచించారు. ఈ పక్కా స్కెచ్‌లో భాగంగా సదరు రౌడీషీటర్ గ్యాంగ్ ఇప్పటికే రెండుసార్లు శ్రీనివాస యాదవ్ కదలికలపై రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. గతంలో వైసీపీ నేత నరేంద్ర రెడ్డి స్థానికంగా చేసిన అరాచకాలను, భూకబ్జాలను శ్రీనివాస యాదవ్ తీవ్రంగా అడ్డుకోవడమే కాకుండా, గత సాధారణ ఎన్నికల పోలింగ్ రోజున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై(Pemmasani chandrashekhar) కూడా నరేంద్ర రెడ్డి దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ పాత కక్షల నేపథ్యంలోనే ఈ సుపారీ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణ హత్య కుట్రపై సమాచారం అందుకున్న గుంటూరు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాల ఆధారంగా వైసీపీ నేత నరేంద్ర రెడ్డిపై కేసు నమోదు చేయడంతో ఆయన ప్రస్తుతం పరారయ్యారు. తృటిలో ప్రాణాపాయం తప్పిన జనసేన నేత ఉదంతంతో గుంటూరు జిల్లా కూటమి శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నరేంద్ర రెడ్డితో పాటు ఈ కుట్రలో భాగస్వామ్యమైన రౌడీ గ్యాంగ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.








