విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భావోద్వేగ వాతావరణం..!
ఉత్తరాంధ్ర ప్రజల రవాణా ముఖచిత్రంలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్యపరమైన విమాన సేవలు అధికారికంగా నిలిచిపోయాయి. నూతనంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram Airport) నుంచి విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంతో, నిబంధనల ప్రకారం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. ఇకపై ఈ రన్‌వే కేవలం భారత నావికాదళం(Indian army) రక్షణ అవసరాలకు మరియు వ్యూహాత్మక మిలిటరీ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కానుంది.
ఈ విమానాశ్రయం నుండి నడిచిన చివరి కమర్షియల్ సర్వీస్ వేళ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఎంతో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులు, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ విమానాశ్రయంతో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ ప్రయాణాలకు వేదికగా నిలిచిన టెర్మినల్ బిల్డింగ్, రన్‌వేల వద్ద ప్రయాణికులు ఆఖరిసారిగా ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో ఒక వెలుగు వెలిగిన ఈ ఎయిర్పోర్ట్ నుంచి చివరి విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు అధికారులు, సిబ్బంది సైతం ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పౌర విమాన సేవలు ముగియడం ఒక అధ్యాయానికి ముగింపు అయితే, భోగాపురం రూపంలో అంతకంటే అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన గ్లోబల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి సరికొత్త మైలురాయిగా నిలవనుంది. విశాఖపట్నం నుంచి విమానాలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికుల రద్దీ మరియు విమానయాన సంస్థల కౌంటర్లు అన్నీ ఇకపై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి షిఫ్ట్ అయ్యాయి. అటు భోగాపురంలో నేడు తొలి విమానం ల్యాండ్ అయింది.








