సర్జరీ తర్వాత ఆయుర్వేద చికిత్సకు పవన్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(pawan kalyan) ప్రస్తుతం తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న ఆయన.. పూర్తిస్థాయి కోలుకునే ప్రక్రియలో భాగంగా కేరళకు చేరుకున్నారు. డాక్టర్ల సూచనల మేరకు శనివారం కేరళ వెళ్లిన పవన్ కళ్యాణ్.. త్రిసూర్ సమీపంలోని ఓ ప్రముఖ ఆయుర్వేద హాస్పిటల్, రిసార్ట్‌లో స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోనున్నారు. భుజం సమస్య నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు శరీరానికి పూర్తి విశ్రాంతి కల్పించేందుకు ఈ ట్రీట్మెంట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
గత నెలలో ముంబైలో పవన్ కు రొటేటర్ కఫ్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ.. ఆయన తిరిగి తన పొలిటికల్ అఫీషియల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో భుజంపై ఒత్తిడి పెరగడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. అనంతరం భుజం వాపుతో పాటు జ్వరం వంటి సమస్యలు కూడా తలెత్తడంతో డాక్టర్లు మరోసారి ట్రీట్మెంట్, విశ్రాంతిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలో కొంతకాలం కేరళలోనే ఉండి ఆయుర్వేద విధానంలో ట్రీట్మెంట్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు అవసరమైన థెరపీ, రెస్ట్ అందించేలా వైద్య బృందం పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగనుంది. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తన సాధారణ రాజకీయ బాధ్యతలను కొనసాగించనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో పవన్ తిరిగి తన రెగ్యులర్ కార్యకలాపాల్లోకి వచ్చే అవకాశం ఉంది.








