ఇరుముడి సక్సెస్‌తో రవితేజ నెక్ట్స్ మూవీపై పెరిగిన అంచనాలు
మాస్ మహారాజా రవితేజ(raviteja)కు ఇరుముడి(Irumudi) సినిమా సక్సెస్ కొత్త ఊపునిచ్చింది. వరుస ఫ్లాపులతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయనకు ఈ సక్సెస్ కెరీర్ పరంగా కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా మారింది. ముఖ్యంగా తన సినిమాలపై పెట్టుబడులు పెట్టిన నిర్మాతలకు ఆశించిన స్థాయిలో రాబడులు రాకపోవడంతో, ఇటీవల రవితేజ భారీ రెమ్యూనరేషన్ కంటే లాభాల్లో వాటా తీసుకునే విధానానికే ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.
తాజా సక్సెస్‌తో ఇప్పుడు ఆయన తర్వాతి ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది. డైరెక్టర్ హసిత్ గోలి(Hasith Goli) తెరకెక్కించనున్న ఈ సినిమా మల్టీస్టారర్‌గా రూపొందనుంది. ఇందులో శ్రీవిష్ణు(Sree Vishnu) మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు(Dil raju) తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ముందుగా ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 28న సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే టార్గెట్ తో టీమ్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు కూడా రవితేజ లాభాల్లో వాటా విధానాన్నే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇరుముడి సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.








