ధురంధర్ కు ముందు అంతా కష్టమే.. రణ్వీర్ సింగ్ ఓపెన్ కామెంట్స్!
ధురంధర్(Dhurandhar) సినిమా తన కెరీర్లో ఎంతో కీలకమైన సమయంలో వచ్చిందని బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh) వెల్లడించారు. కెరీర్లో సక్సెస్లతో పాటు ఫెయిల్యూర్లు కూడా సహజమేనని, తాను కూడా అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వని టైమ్లో ధురంధర్ కథ తన ముందుకు వచ్చిందని, డైరెక్టర్ ఆదిత్య ధర్(Aditya Dhar)తో కలిసి ఈ ప్రాజెక్ట్ను ఒప్పుకునే టైమ్ కు తామిద్దరూ ఛాలెంజెస్తో కూడిన దశలో ఉన్నామని రణ్వీర్ పేర్కొన్నారు.
భారీ స్థాయిలో తెరకెక్కాల్సిన ఈ సినిమాను అనుకున్న విధంగా రూపొందించడం అంత ఈజీ కాలేదని రణ్వీర్ చెప్పారు. కథపై ఉన్న నమ్మకంతోనే తాను, ఆదిత్య ధర్ ముందుకు సాగామని, నిర్మాణ సమయంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గలేదని వివరించారు. ముఖ్యంగా సినిమాను నమ్మి అండగా నిలిచిన జియో స్టూడియోస్(Jio Studios), అంబానీ కుటుంబానికి రణ్వీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయంలో వారు చూపించిన నమ్మకం తమకు ఎంతో బలాన్నిచ్చిందని, అలాంటి మద్దతు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
తన కెరీర్ను ఇప్పుడు మరింత వాస్తవిక దృక్పథంతో చూస్తున్నానని రణ్వీర్ స్పష్టం చేశారు. కెరీర్ హై, ఊపర్- నీచే చల్తా హై అంటూ ప్రతి నటుడి జర్నీలోనూ మంచి, చెడు దశలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ధురంధర్ తనకు కేవలం మరో సినిమా కాదని, ఒక కఠిన సమయంలో వచ్చిన కీలక అవకాశం అన్న భావన ఆయన మాటల్లో కనిపిస్తోంది.








