కాకినాడ జీజీహెచ్‌ను 3 వేల పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు
విజయవాడ, నవంబర్ 10: కాకినాడ ప్రజలకు మెరుగైన, అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక చొరవతో కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించి, అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలతో 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్ది ప్రభుత్వానికి అందించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ HLL Infra Tech Services Limited (HITES) ఆసక్తి వ్యక్తం చేసింది.
ఈ ప్రతిపాదనకు సంబంధించి మంగళవారం విజయవాడలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌తో HITES సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో HITES వైస్ ప్రెసిడెంట్ రత్నాచలం, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జీజీహెచ్‌ను 3 వేల పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, చేపట్టాల్సిన పనులపై చర్చించారు.
కాకినాడ వైద్య రంగానికి ఆధునిక రూపం..
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఉమ్మడి తూర్పుగోదావరి ప్రాంతంతో పాటు పరిసర జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కీలకమైన ప్రభుత్వ వైద్య సేవల కేంద్రంగా ఉంది. అయితే పెరుగుతున్న జనాభా, మారుతున్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగైన వైద్య సదుపాయాలు, ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆసుపత్రిని 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఒకే చోట వివిధ రకాల ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఆధునిక వైద్య పరికరాలు, మెరుగైన చికిత్సా సదుపాయాలు, అవసరమైన ఆసుపత్రి మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాలను ప్రాథమికంగా చర్చించారు.
HLL Infra Tech Services Limited (HITES) అనేది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ HLL Lifecare Limitedకు 100 శాతం అనుబంధ సంస్థ. ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధి, డిజైన్, ఇంజినీరింగ్, నిర్మాణ నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఆసుపత్రుల నిర్వహణ వంటి రంగాల్లో HITES సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు ఉన్న ఆసుపత్రి మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక వైద్య సదుపాయాల ఏర్పాటు అనుభవాన్ని కాకినాడ జీజీహెచ్ ఆధునీకరణకు వినియోగించుకునే అవకాశాలపై సమావేశంలో చర్చించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు
కాకినాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర, ప్రత్యేక వైద్య చికిత్సల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గించి, నాణ్యమైన వైద్య సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలన్నది తన ప్రయత్నమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చని తెలిపారు.







