తోతాపురి మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిస్తూ తీపి కబురు అందించింది. మార్కెట్లో తోతాపురి మామిడి ధరలు తీవ్రంగా పడిపోవడంతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు మద్దతుగా నిలిచేందుకు ‘ధరల వ్యత్యాస పథకం’ (Price Deficiency Payment Scheme) కింద రూ. 281 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం ద్వారా మార్కెట్ ధరల పతనంతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం కిలోకు రూ. 4 చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, మరియు కడప జిల్లాల్లోని తోతాపురి మామిడి రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది. ఈ మార్కెటింగ్ సీజన్లో దాదాపు 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి దిగుబడికి ఈ ధరల వ్యత్యాస సాయాన్ని వర్తింపజేయనున్నారు. పశ్చిమాసియా (Middle East) భౌగోళిక పరిస్థితుల వల్ల మామిడి పల్ప్ ఎగుమతులు దెబ్బతిని, ధరలు దారుణంగా పడిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తక్షణ ఉపశమనంగా ఈ నిధుల సమీకరణకు ఆదేశాలిచ్చింది.
ఇవి కూడా చదవండి
ఈ ఆర్థిక సాయానికి అవసరమైన నిధులను త్వరితగతిన పంపిణీ చేసేందుకు వీలుగా వర్కింగ్ క్యాపిటల్ లేదా స్వల్పకాలిక రుణాల ద్వారా నిధులను సమీకరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మార్క్‌ఫెడ్ (AP Markfed) సంస్థకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ నిధులను మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు పంపిణీ చేసిన అనంతరం, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం నుండి రీయింబర్స్మెంట్ ప్రక్రియ జరగనుంది. ఈ నిర్ణయం ధరల పతనంతో కుదేలైన ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల్లో సరికొత్త ఆశలు చిగురింపజేసింది.








