ఏపీ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర సమయాల్లో కార్పొరేట్ స్థాయి అత్యున్నత వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా అందించేలా ఏకంగా 22 జిల్లాల్లో అత్యవసర చికిత్స విభాగాల (Critical Care Blocks) ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏకంగా రూ. 249.50 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, మరియు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.
ఈ మహాత్కార్యానికి సంబంధించి ఈ నెల 12వ తేదీన విజయవాడలో భారీ కార్యక్రమం జరగనుంది. విజయవాడలోని పాత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) ఆవరణలో అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రత్యక్షంగా హాజరై అధికారికంగా ప్రారంభించనున్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన వెంటిలేటర్లు, ఐసీయూ (ICU) బెడ్లు మరియు ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌తో ఈ బ్లాక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలోని మిగిలిన 21 జిల్లాల్లో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాకులు, అలాగే పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను రిమోట్ బటన్ నొక్కి వర్చువల్ పద్ధతిలో ఏకకాలంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ నూతన అత్యవసర చికిత్స విభాగాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు లేదా గుండెపోటు వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంత రోగులు పెద్ద ఆసుపత్రుల కోసం దూర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే తక్షణ అత్యవసర వైద్యం అందుతుంది.








