ఐటీ, ఫార్మా రంగాలకు రూపాయి కష్టాలు
ఆరు నెలల క్రితమే డాలర్ మారకంలో కనిష్ఠ స్థాయిని తాకిన రూపాయి ఒక్కసారిగా జూలు విదిల్చి దూసుకుపోతుండటం టెక్నాలజీ కంపెనీలను కలవరపరుస్తోంది. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడుగా రుపీ విలువ బలపడితే టెక్నాలజీ కంపెనీల కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఐటీ కంపెనీల రాబడులపై మారకం విలువ ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి విలువ 5.6 శాతం మేర పెరిగింది. డాలర్ మారకంలో రూపాయి 64.05 వద్ద ముగిసింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మధ్యకాలికంగానే రూపాయి విలువ 61.80 స్థాయికి చేరవచ్చని అంచనావేస్తున్నారు. నిజానికి బలమైన రూపాయి వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. అయితే ఎగుమతి రంగంలోని సంస్థల రాబడులకు మాత్రం గండిపడుతుంది. ఇప్పటికే ఐటీ కంపెనీలు ట్రంప్ కారణంగా అమెరికా నుంచి వ్యాపార పరంగా కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ దెబ్బ, ఆటోమేషన్ కారణంగా తగ్గుతున్న రెవెన్యూతో ఉద్యోగాల్లోనూ భారీ కోతలను ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. మారకం విలువపై అనిశ్చిత కారణంగా భవిష్యత్ రాబడుల అంచనాల విషయంలో కూడా ఐటీ దిగ్గజ కంపెనీలు నిరుత్సాహంగా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా పేరుతో దేశీయ వస్తువులు తయారు చేసి ఎగుమతుల ద్వారా భారీ రాబడులు సంపాదించే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వానికి కూడా ఈ పరిణామాలు మంచి సంకేతాలు కావు. అయితే ఆర్బిఐ మాత్రం రుపీ దూకూడును నిలువరించే ప్రయత్నం చేయడం లేదు.








