అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా మరో ముందడుగు పడింది. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్లు పెంచుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసుకోవాడానికి కేంద్ర న్యాయశాఖ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దస్త్రానికి న్యాయశాఖ ఆమోదముద్ర వేసి హోంశాఖకు పంపినట్లు సమాచారం. ఇప్పటివరకూ అసెంబ్లీ సీట్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 170(3)కి చిన్న సవరణ చేస్తే సరిపోతుందని న్యాయశాఖ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆ ఆర్టికల్ కింద పొందుపరిచిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వర్తించవని పేర్కొంటూ రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుందని సూచించినట్లు తెలిసింది. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెంచాలంటే ఆర్టికల్ 170(3)కి సవరణ చేయాల్సిందేనని గత అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ చెప్పారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగానే ఇప్పుడు న్యాయశాఖ సవరణలు సూచించినట్లు సమాచారం.








