ముందస్తు ఎన్నికల సమాచారం మోడీ ఈ తెలుగు నేతలకు చెప్పారట!
దేశంలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైందా? జమిలీ ఎన్నికల కంటే ముందస్తుకే మొగ్గు చూస్తున్నారా? ఇందులో తెలగు రాష్ర్టాలకు సిగ్నల్ అందిందా? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాచారం అందిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ముందస్తు ఎన్నికల సంకేతాలు కూడా అక్షరక్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ కే అందాయని సమాచారం. అదికూడా అక్కడి ప్రతిపక్షపార్టీకే ఈ సమాచారాన్ని చేరవేయడం విశేషం.
ఈ ఏడాది మే 10న ఎవరూ ఊహించని రీతిలో ఏపీలో ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ అప్పాయింట్మెంట్ లభించిన విషయం తెలిసిందే. ఆ భేటీలోనే ప్రధాని ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న సంగతి వెల్లడించినట్టు సమాచారం. ఆ తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం ఈ సమాచారాన్ని చెప్పడంతో వారిద్దరూ ఎన్నికల హడావుడి మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజాకర్షక పథకాలు, కార్యక్రమాలు, ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు, ప్రచారాలు మొదలయ్యాయని అంటున్నారు. ఇద్దరు సీఎంలు కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇదే కారణమని కూడా చెప్తున్నారు.
మరోవైపు తన మంత్రివర్గ సహచరులకు సైతం ప్రధాని ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. కేంద్ర కేబినెట్విస్తరణ జరిగిన తర్వాత గత మంగళవారం తొలిసారిగా కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ వెంటనే కేంద్రమంత్రిమండలిలోని సహాయమంత్రులతో సహా అందరు మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, 2018 డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలిచ్చారని తెలుస్తోంది. అందుకే రానున్నఏడాది కాలంలో ప్రజలను ఆకట్టుకునేలా పనిచేయాలని, ఏది చేసినా పార్టీ ప్రయోజనాలు, గెలుపు అవకాశాలు పెంపొందించాలని మంత్రులందరికీ సూచించినట్టు తెలు స్తోంది. ముందస్తు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వంలో సరిగా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలికి నలుగురు బ్యూరోక్రాట్లతో సహా మొత్తం 9 మందిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసూ ప్రజా బలం పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.








