ప్రధానికి పుష్పగుచ్ఛం ఇవ్వొద్దు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక మీదట దేశంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు స్వాగతం పలికే సమయంలో పుష్పగుచ్ఛం ఇవ్వొద్దని హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. దానికి బదులుగా ఆయనకు గౌరవార్థంగా ఖాదీ చేతిరుమాలు లేదా ఓ పుస్తకాన్ని ఇవ్వాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసింది. ‘ప్రధాని మోదీ పర్యటన సమయంలో స్వాగతం పలికేందుకు పుష్పగుచ్ఛం ఇవ్వొద్దు. ఈ నిబంధనలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా పాటించాలి’ అని ఎంహెచ్ఏ నోటీసుల్లో పేర్కొంది. గతంలోను ప్రధాని మోదీ ఓ బహిరంగ సభలో మాట్లాడే సమయంలో పుష్పగుచ్ఛాలకు బదులుగా ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండని చెప్పారు.








