రూ.90వేల కోట్ల విలువైన ఫోన్ల ఉత్పత్తి
ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కూడా పెరుగుతూ వస్తోంది. ఇక మొబైల్ ఫోన్ వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా మారిపోయింది. దాన్ని అవకాశంగా తీసుకుని కొత్తకొత్త మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నాయి తయారీ సంస్థలు. అలా గత ఆర్థిక సంవత్సరంలో రూ.90వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అయినట్లు కేంద్రం శుక్రవారం వెల్లడించింది. కాగా.. విదేశాల నుంచి రూ.24,364 కోట్ల విలువైన ఫోన్లను దిగుమతి చేసుకున్నట్లు పేర్కొంది.
అనతికాలంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్రం తెలిపింది. ‘2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.18,900కోట్ల విలువైన ఫోన్లను తయారుచేయగా.. 2015-16 సంవత్సరానికి ఆ సంఖ్య ఏకంగా రూ.54వేల కోట్లకు పెరిగింది. అంటే 185శాతం వృద్ధి సాధించింది. ఇక 2016-17లో 67శాతం వృద్ధి చెంది రూ.90వేల కోట్ల విలువైన ఫోన్లను ఉత్పత్తి చేశారు’ అని టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
ఇక విదేశాల నుంచి ఫోన్లను దిగుమతి చేసుకోవడం తగ్గుతూ వస్తోందని సిన్హా పేర్కొన్నారు. 2014-15 కాలంలో 210 మిలియన్ యూనిట్లను దిగుమతి చేసుకోగా.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 146 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. గతేడాదికి మరింత తగ్గి 76 మిలియన్ యూనిట్లుగా ఉందని సిన్హా చెప్పారు. ప్రముఖ బ్రాండ్ సంస్థలన్నీ దేశంలోనే తయారీ కేంద్రాలను ప్రారంభించడంతో దేశీయ ఉత్పత్తి పెరిగిందని తెలిపారు.








