మరో వికెట్ పడనున్నదా….?
అనూహ్యం: ప్రధాని మోదీకి మమత మద్దతు
ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్యంగా స్వరం మార్చారు. మోదీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. అయితే బీజేపీ, అమిత్ షా తీరుపై ఆమె విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. దేశానికి ప్రధాని మోదీనా, అమిత్ షానా అని ప్రశ్నించారు.
‘నరేంద్ర మోదీకి నేను అనుకూలం. అమిత్ షాకు కాదు. ప్రధానమంత్రిని విమర్శించాలనుకోవడం లేదు. ఆయనను ఎందుకు విమర్శించాలి. ఆయన పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటార’ని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రులతో అమిత్ షా అధికారిక సమావేశం నిర్వహించడంపై స్పందిస్తూ.. ‘దేశంలో నెలకొన్న అధి నియంతృత్వం(సూపర్ డిక్టేటర్షిఫ్)పై అందరూ భయపడుతున్నారు. ఒక పార్టీకి చెందిన అధ్యక్షుడు.. మంత్రులతో ఎలా సమావేశమయ్యారు. ప్రధాని ఎవరు? మోదీనా, షానా’ అని మమత ప్రశ్నించారు.
మాజీ ప్రధాని వాజపేయిపై ప్రశంసలు కురిపించారు. బీజేపీకి చెందిన నాయకుడైనప్పటికీ ఆయన నిష్పక్షపాతంగా, సమదృష్టితో పనిచేశారని కితాబిచ్చారు. ఆయనతో కలిసి పనిచేనినప్పుడు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్ని ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు. ఇప్పటికి ఎటువంటి కూటమి ఏర్పడలేదని, ఇప్పుడే పని మొదలు పెట్టామని.. ఆరు నెలలు ఆగాలని మమతా బెనర్జీ అన్నారు.








