ఒక రోజులోనే పాన్, టాన్
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు కోసం ఒక రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. దరఖాస్తున్న చేసిన రోజు ఇక కార్డు తీసుకోవచ్చు. కంపెనీలకు సంబంధించి ఆదాయ పన్ను (ఐటి) శాఖ ఇప్పటికే దీన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి 31 వరకు నమోదైన 19,704 కంపెనీలకు అదే రోజు పాన్ నంబర్ జారీ చేసినట్లు తెలిపింది. భౌతిక పాన్ కార్డులతో పాటు, ఎలక్ట్రానిక్ పాన్ (ఇ-పాన్) కార్డులు కూడా ప్రవేశ పెట్టినట్టు సిబిడిటి ప్రకటించింది. కంపెనీలతో పాటు, వీటి కోసం దరఖాస్తు చేసిన కొంత మంది వ్యక్తులకు కూడా ఇ-పాన్ కార్డులను ఇ-మెయిల్ ద్వారా పంపించినట్టు తెలిపింది. డిజిటల్ సంతకాలతో కూడిన ఈ కార్డులను ఇతర సంస్థలకు గుర్తింపు కార్డులుగా ఎలక్ట్రానిక్ పద్దతిలో నేరుగా పంపవచ్చు. లేదా డిజిలాకర్.జిఒవి.ఇన్ వెబ్ సైట్లో స్టోర్ చేసుకోవచ్చు. కొత్తగా నమోదయ్యే కంపెనీలకు పాన్ కార్డు లతో పాటు, పన్ను తగ్గింపు ఖాతా సంఖ్య (టాన్)నూ అదే రోజు జారీ చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. కంపెనీల వ్యవహారాల శాఖ (ఎంసిఎ) దగ్గర నమోదైన వెంటనే ఎంసిఎ ఆ వివరాలను సిబిడిటికి పంపిస్తుంది. ఆ వివరాల ఆధారంగా ఐటి శాఖ కంపెనీలకు ఒకే రోజు పాన్, టాన్ కార్డులు జారీ చేస్తుంది.













