దలైలామాతో అమెరికా ప్రతినిధి వర్గం చర్చలకు చైనా అభ్యంతరం
భారతదేశంలో దలైలామాతో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధివర్గం భేటీ కావడంపై చైనా అమెరికాకు దౌత్యపరమైన నిరసన తెలిపింది. ప్రపంచానికి ఈ భేటీ తప్పుడు సంకేతాలు పంపిందని చైనా విమర్శించింది. విదేశాల్లో చైనా వ్యతిరేక వేర్పాటు ధోరణులను దలైలామా వ్యాపింపచేస్తున్నట్లు ఆ దేశం ఆరోపించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ సువాంగ్ ఈ వ్యాఖ్య చేశారు. ధర్మశాలలో ఇటీవల అమెరికా ప్రతినిధివర్గం లామాతో జరిపిన చర్చలపై ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికా ప్రతినిధివర్గం జరిపిన తొలి పర్యటన ఇది అని జెంగ్ వివరించారు. అమెరికా ప్రభుత్వ నిబద్ధతపై ఈ పరిణామం నీడలు ప్రసరించిందని జెంగ్ వ్యాఖ్యానించారు.








