బ్యాంకు దోపిడీ కోసం అర కిలోమీటరు సొరంగం
-8 కోట్ల వ్యయంతో తవ్విన 16 మంది దొంగలముఠా-బ్రెజిల్లో 2400 కోట్ల దోపిడీకి భారీ పన్నాగం-పసిగట్టి పట్టుకున్న పోలీసులు
చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీకి పథకం వేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. కష్టపడి తవ్విన సొరంగం గుట్టు రట్టయింది. 16 మంది దొంగల ముఠా డ్యామిట్ అనుకుంటూ కటకటాలు లెక్కిస్తున్నది. బ్రెజిల్‌లోని సావోపోలోలో దొంగలు తమ స్థావరం నుంచి బ్యాంకు భోషాణం దాకా 550 గజాల (అర కిలోమీటరు) పొడవైన సొరంగం తవ్వారు. నేషనల్ బ్యాంకులోని 24 కోట్ల పౌండ్ల (భారతీయ కరెన్సీలో రూ.2400 కోట్లు) సొమ్ము దొంగిలిద్దామనేది పథకం. విజయవంతంగా అమలైతే అదే అతిపెద్ద బ్యాంకు దోపిడీగా రికార్డుకెక్కేది. నాలుగు నెలలు అహోరాత్రాలు కష్టపడి అద్దెకు తీసుకున్న స్థావరం నుంచి నేరుగా బ్యాంకు స్ట్రాంగ్‌రూం వరకు ఓ మనిషి సునాయాసంగా నడిచివెళ్లేలా సొరంగం తవ్వారు. అందులోనూ నైపుణ్యమంతా చూపారు. మట్టిపెళ్లలు విరిగిపడకుండా చెక్కలు పేర్చి, స్తంభాలు ఆదరువుగా పెట్టారు. లైట్లు అమర్చారు. విశ్రాంతి కోసం స్టూల్స్ కూడా పెట్టారు. మరి అంతభారీ సొరంగమంటే ఊరికే అవుతుందా? మన కరెన్సీలో రూ.8 కోట్లు ఖర్చుచేశారట.16 మంది దొంగలు ఆ ఖర్చును సమానంగా భరించారు. పోలీసులకు ముందుగానే ఉప్పందినా రెండు నెలలుగా ఆ ముఠా కదలికలు గమనిస్తూ కూర్చున్నారు. సొరంగం దాదాపుగా పూర్తయిన తర్వాత రంగంలోకి దిగి ముఠాను అరెస్టు చేశారు.
చరిత్రలో 10 అతిపెద్ద దొంగతనాలు
– దారెస్సలాం బ్యాంక్-బాగ్దాద్ (ఇరాక్) – 2007 – రూ.1863 కోట్లు
-నైట్స్‌బ్రిడ్జ్ వాల్ట్-లండన్ (బ్రిటన్)- 1987- రూ.629 కోట్లు
-సెక్యూరిటాస్ డిపో దోపిడీ-కెంట్ (బ్రిటన్)-2006-రూ.538 కోట్లు
-బ్యాంకో సెంట్రల్ దోపిడీ-ఫోర్టాలెజా (బ్రెజిల్)-2005- రూ.454 కోట్లు
-బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్-1976-బీరుట్ (లెబనాన్)-రూ.325 కోట్లు
-నార్తర్న్ బ్యాంక్ దోపిడీ-బెల్ఫాస్ట్ (బ్రిటన్)-2004-రూ.266 కోట్లు
-బ్రింక్స్ మ్యాట్ లండన్ (బ్రిటన్)- 1983-రూ.266 కోట్లు
-హాటన్గార్డెన్ సేఫ్ డిపాజిట్ కంపెనీ దోపిడీ-లండన్-రూ.215 కోట్లు
-డన్బార్ దోపిడీ- లాస్ ఏంజెల్స్(అమెరికా)-1997-రూ.122 కోట్లు
-గ్రట్ ట్రెయిన్ రాబరీ-బకింగ్‌హామ్‌షైర్ (బ్రిటన్)-1963-రూ.25.8 కోట్లు













