రాష్ట్రపతిగా మళ్లీ ప్రణబ్?
రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి మాట చెల్లకుండా చూసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలోని ప్రతిపక్షం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రంగంలోకి తెస్తోంది. ప్రణబ్ ముఖర్జీకి రెండోసారి అవకాశం ఇచ్చేందుకు బిజెపి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరిస్తే కొత్త రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవచ్చని ప్రతిపక్షం ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. కొత్త రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షం అనుసరించవలసిన వ్యూహం గురించి సోనియా గాంధీ వివిధ ప్రతిపక్షాలకు చెందిన సీనియన్ నాయకులతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారు. ఆమె అవసరమైతే శివసేన, బిజూ జనతాదళ్ అదినాయకులతో చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వామపక్షాలతో కలిసి పని చేసేందుకు ఎంతమాత్రం ఇష్టపడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీతో కూడా సోనియాగాంధీ తెరవెనుక చర్చలు జరుపుతున్నాయని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.








