2019లో జరిగే లోక్ సభ ఎన్నికల పై అమిత్ షా దృష్టి
తెలంగాణాలో ఏడు, ఆంధ్రలో ఐదు సెగ్మెంట్లతోపాటు దేశం మొత్తంమీద 350 లోక్‌సభ స్థానాలపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారిస్తున్నారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 350 స్థానా లు కైవసం చేసుకోవటం ద్వారా రెండోసారీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేందుకు షా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈనేపథ్యంలో షా ప్రత్యేక దృష్టి సారించనున్న 150 లోక్‌సభ స్థానాల్లో ఏడు తెలంగాణ, ఐదు ఆంధ్ర స్థానాలు ఉన్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన బిజెపికి ప్రస్తుతం 282 లోక్‌సభ సీట్లున్నాయి.
ఈ విజయాన్ని 350కి చేర్చేందుకు షా ఇప్పటి నుంచే పెద్దఎత్తున ప్రయత్నాలు మొదలెట్టారు. గతవారం 10మంది మంత్రులతో సమావేశమై చర్చించిన అమిత్ షా, అద్భుతమైన కార్యాచరణ సిద్ధం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోర్టీంలోవున్న పదిమంది మంత్రులు శాఖల బాధ్యతలు చూసుకుంటూనే, షా రూపొందిస్తున్న 2019 కార్యచరణ పథకం అమలునూ పర్యవేక్షిస్తారని అంటున్నారు. ఎంపిక చేసిన 350 లోక్‌సభ స్థానాల్లో మూడు నెలలకోసారి సర్వే జరిపించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తారు. అలాగే, బిజెపి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఎంపీ పని తీరు? ప్రధాని మోదీ చేపట్టిన పథకాల ఫలితాలు వారికి ఏమేరకు అందుతున్నాయి? బిజెపి శ్రేణులు ఏమేరకు ప్రజలకు వివరించగలుగుతున్నారు? వీటిపై ప్రజాభిప్రాయం ఏమిటి? అనేది తెలుసుకుంటారు. బిజెపి ఎంపీలు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే మరింత లోతుగా, నిశితంగా జరుగుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సమర్థంగా పనిచేయని బిజెపి ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించటం కష్టమని అంటున్నారు. ఎంపిక చేసిన 350 లోక్‌సభ స్థానాలకు స్థానిక రాజకీయాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యచరణ పథకాలు సిద్దం చేస్తున్నారు. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు ప్రత్యేక కార్యకర్తలను కేటాయిస్తున్నారు. వీరు తమకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గంలో ఉంటూ పనిచేయాల్సి ఉంటుంది. ఇదిలావుంటే బిజెపి విజయం సాధించేందుకు వీలున్న 150 లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.








