చిన్నమ్మకు ఝలక్ ఇచ్చిన పళనిస్వామి
తమిళనాడు అన్నాడీఎంకేలో గురువారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పళనిస్వామి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. శశికళ వర్గానికి పళనిస్వామి షాకిచ్చారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వేటు వేసేశారు. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీగా దినకరన్ ఎన్నిక చెల్లదని పళని వర్గం తీర్మానం చేసింది. దినకరన్ ఎన్నిక చట్ట విరుద్ధమని అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం అభిప్రాయపడింది. దీంతో దినకరన్ కు చెక్ పెట్టినట్లయింది. దినకరన్ తో పాటుగా మరో 64 మందిని పళని వర్గం పార్టీ నుంచి బయటకు పంపించి వేసింది. ఈ నెల 15వ తేదీన పళనిస్వామి, పన్నీర్ వర్గం ఏకమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య చర్చలు ఈరోజు సాయంత్రం ప్రారంభమయ్యే అవకాశముంది. పన్నీర్ కు డిప్యూటీ జనరల్ సెక్రటరీ లేదా ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించే వీలుంది. అలాగే పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు పళనిస్వామి వర్గం స్పష్టం చేసింది.
పన్నీర్ కు పార్టీ పదవి లేక మంత్రిపదవా?
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలు కెళుతూ తన మేనల్లుడు దినకరన్ ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే దినకరన్ పార్టీ గుర్తు, పేరు కోసం ఎన్నికల అధికారులకు లంచం ఇవ్వచూపిన కేసులో జైలుకెళ్లి బెయిల్ పై వచ్చారు. బెయిల్ పై వచ్చిన దినకరన్ దూకుడు పెంచారు. పళనిస్వామికి డెడ్ లైన్ కూడా విధించారు. త్వరలో తాను పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. దాదాపు 34 మంది శాసనసభ్యులతో మంతనాలు సాగించిన దినకరన్ పళనిపై తిరుగుబాటు జెండా ఎగుర వేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు పళనిస్వామిలో బయలుదేరాయి. మరోవైపు బీజేపీ కూడా రెండు వర్గాలూ విలీనం కావాలని వత్తిడి తెస్తోంది. పన్నీర్ సెల్వాన్ని కలుపుకుని పోవాలని పళనిస్వామికి బీజేపీ నచ్చజెప్పింది. అన్నాడీఎంకే ఒకటిగా ఉంటే తాము కూడా మద్దతిస్తామని బీజేపీ చెప్పడంతో ఇప్పుడు ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే పళనిస్వామి పన్నీర్ సెల్వం పెట్టే షరతులకు అంగీరిస్తున్నట్లే కన్పిస్తుంది. అందుకే తొలుత దినకరన్ పై వేటు వేశారు. ప్రస్తుతం దినకరన్ చెన్నైలో లేరు. ఆయన ఈరోజు సాయంత్రానికి చెన్నైకి రానున్నట్లు తెలిసింది. దినకరన్ వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.













