త్వరలో ఆధార్ ఉంటేనే విమానయానం
విమానం ఎక్కడానికి ఎయిర్‌పోర్టుకు వెళుతున్నారా? వీసా, పాస్‌పోర్టు, ఎక్కాల్సిన విమానం టికెట్ బ్యాగులో ఉన్నాయో లేదో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొన్నారా? వాటితోపాటు ఆధార్ కార్డును కూడా వెంట తీసుకెళ్లాల్సిన సమయం త్వరలోనే రానుంది. అప్పుడు ఆధార్ ఉంటేనేగానీ విమానంలో కూర్చోనీయరు. బుకింగ్ కౌంటరులో ఆధార్ నంబరు ఇస్తేనే టికెట్ చేతిలో పెడతారు. వేలిముద్రలు తీసుకొన్న తరువాతే ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోకి, అటు తరువాత విమానంలోకి అనుమతిస్తారు. ఎయిర్‌పోర్టుల రక్షణ, విమానాల్లో ప్రయాణికుల భద్రతని దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ యాక్సిస్ విధానాన్ని అమలుచేయాలని భావిస్తోంది. తొలుత దేశీయ విమాన సర్వీసులకు ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.













