కేరళ సర్కార్ స్కూళ్లలో ఫ్రీ వైఫై
కేరళ రాష్ట్రంలోని విద్యావ్యవస్థను డిజిటలైజేషన్ చేసేందుకు ఆ రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 10వేల గవర్నమెంట్ స్కూళ్ల లో త్వరలోనే ఫ్రీ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL సాయంతో కేరళ స్కూళ్లను వైఫైతో అనుసంధానం చేసేందుకు కసరత్తు చేపట్టింది. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదన జరుపుకుంటారు. అదే రోజు నుండి ఈ ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.దీంతో నవంబర్ 1వ తేదీ నుండి విద్యార్థులందరికి 2 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఉచితంగా వైఫై లభిస్తుంది.
పదేళ్ల క్రితమే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనీ అందించే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 5వేల స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు అధికారులు. అది విజయవంతం కూడా అయింది. దాని స్ఫూర్తితోనే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) విధానాన్ని రూపొందించారు. చిన్న తరగతుల నుండే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసేందుకు చర్యలు చేపట్టారు.








