Tamilnadu: తమిళనాడు ఎన్డీయేలో సీట్ల ‘డీల్’ సెట్..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందే ఎన్డీయే (NDA) కూటమిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ చర్చలు, మంతనాల తర్వాత సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చింది. ఈసారి కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అన్నాడిఎంకె (AIADMK) మెజారిటీ సీట్లను దక్కించుకోగా, జాతీయ పార్టీ బిజెపి (BJP) తన సీట్లను పెంచుకుంది. దక్షిణాదిలో అత్యంత ఆసక్తి రేపుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు విషయంలో గత కొన్ని రోజులుగా ఎన్డియేలో చర్చలు జరుగుతున్నాయి.
మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను జరిగిన ఈ ఒప్పందంలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా సాగుతున్న సీట్ల సందిగ్ధతకు ఈ ప్రకటనతో ముగింపు పలికినట్లయింది. కూటమికి నాయకత్వం వహిస్తున్న అన్నాడీఎంకే ఏకంగా 178 స్థానాల్లో పోటీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా తమకున్న క్యాడర్ బలాన్ని నమ్ముకుని మెజారిటీ స్థానాలను తన వద్దే ఉంచుకుంది. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీకి 27 స్థానాలను కేటాయించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇది మెరుగైన సంఖ్యే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మిగిలిన 29 స్థానాలను కూటమిలోని ఇతర చిన్న పార్టీలకు కేటాయించారు. తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, మొదట్లో మరిన్ని ఎక్కువ సీట్లు ఆశించినప్పటికీ, అన్నాడీఎంకేతో ఉన్న సత్సంబంధాలు, గెలుపు గుర్రాల ఆధారంగా 27 స్థానాలకు సంతృప్తి చెందింది. ఈ 27 నియోజకవర్గాల్లో ప్రధానంగా హిందూ ఓటు బ్యాంకు బలంగా ఉన్న ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాలపై బీజేపీ దృష్టి సారించనుంది. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే, డీఎంకే (DMK) కూటమిని ఢీకొట్టేందుకు భారీ స్థాయిలో 178 సీట్లలో బరిలోకి దిగుతోంది.
తద్వారా సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటాలనే లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. చిన్న పార్టీలపై ఎక్కువగా ఆధారపడకుండా, తన సొంత బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది. మరోవైపు అధికార పార్టీ డీఎంకే కూడా తన మిత్రపక్షాలైన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్దుబాటును ఇప్పటికే ఒక కొలిక్కి తెచ్చింది. ఇప్పుడు ఎన్డీయే కూటమి కూడా తమ సీట్ల లెక్కలను తేల్చేయడంతో తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ప్రధాని మోదీ, అన్నాడీఎంకే అగ్రనేతలు ఉమ్మడి బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. సీట్ల పంపకం పూర్తవ్వడంతో ఇక అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుకానుంది.
ఇవి కూడా చదవండి








