పాక్-సౌదీ-తుర్కియే కీలక రక్షణ ఒప్పందం.. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగినట్లే!
పశ్చిమాసియా యుద్ధ భయాల మధ్య మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు కీలకమైన రక్షణ ఒప్పందం (Defense Agreement) కుదుర్చుకున్నాయి. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పేరిట మూడు దేశాలు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, నిఘా సమాచారం మార్పిడికి ఒప్పందం మార్గం సుగమం చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సౌదీ (Saudi Arabia)లోని మక్కాలో జరిగిన సమావేశంలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్థాన్ (Pakistan) ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లు సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని షెహబాజ్ సౌదీ వెళ్లగా.. ఆయన వెంట ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సహా ఉన్నత స్థాయి బృందం కూడా ఉంది.
కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు మౌలిక సదుపాయాలు, చమురు నిల్వలపైనా డ్రోన్లు, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. మరోవైపు గాజా విషయంలో తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.
మూడు దేశాల రక్షణ ఒప్పందంపై ఇరాన్ స్పందించింది. ఒప్పందంపై మూడు దేశాలు సంతకాలు చేసినప్పటికీ.. ఆ కాగితపు ఒప్పందం శాశ్వత భద్రతకు హామీ ఇవ్వదనే విషయాన్ని సౌదీ తెలుసుకోవాలని ఇరాన్ పార్లమెంట్, నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిషన్ సభ్యుడు ఇబ్రహీం రెజాయి పేర్కొన్నారు. సౌదీ అరేబియా తన విధానాలను మార్చుకుంటే.. భద్రత కోసం ఇతరులను వేడుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.








