ఇరాన్ యుద్ధం మరో ఆఫ్గన్ వార్ ను తలపిస్తోందా..? ట్రంప్ నకు జాయింట్ చీఫ్స్ జనరల్ సూచనలు..!
రెండు మూడు రోజుల్లో ముగుస్తుందనుకున్న పశ్చిమాసియా వార్ కాస్తా అంతులేని యుద్ధంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ ఎంత భీకర దాడులు చేసినా.. ఇరాన్ మాత్రం తగ్గేప్రసక్తే లేదంటోంది. దీనికి గానూ అమెరికా తన అమ్ములపొదిలోని అస్త్రాలన్నింటినీ వినియోగిస్తోంది. ఇజ్రాయెల్ డ్రోన్ ఫ్యాక్టరీలు, అణ్వాయుధ సంస్థలపైనా దాడులు చేసింది. అయినా ఇరాన్ వెనక్కు తగ్గడం లేదు. దీంతో అత్యంత ఖరీదైన అమెరికా ఆయుధాలు.. క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గానికి అగ్రరాజ్య జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం (US-Iran War) నుంచి ఇకనైనా బయటపడాలని.. లేదంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
‘‘ఇరాన్‌తో యుద్ధం స్వల్పకాలికంగా ఉండాల్సింది. ఇప్పటికే అది ఆ దశను దాటేసింది. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రతరం చేయడానికి మనకు అందుబాటులో ఉన్న సైనిక చర్యలు ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. కేవలం వైమానిక శక్తితోనే నిర్దేశిత లక్ష్యాలను మనం సాధించలేం. అందుకే ఇకనైనా, ఈ యుద్ధం నుంచి బయటకు వచ్చే మార్గాలను అన్వేషించాలి’’ అని ట్రంప్ సలహాదారులకు డాన్ కేన్ ప్రైవేటుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి ఆయన పలువురు క్యాబినెట్ అధికారులు, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది..
ఇరాన్లో భూతల దాడులకు విముఖత చూపుతోన్న అధ్యక్షుడు ట్రంప్.. దానికి బదులుగా వైమానిక దాడులను మరింతగా పెంచుతామని ఇటీవల కాలంలో పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ హెచ్చరికలతో ఇరాన్‌ను ఒప్పందానికి తీసుకురావొచ్చని ఆయన విశ్వసిస్తున్నారు. అయితే, సుదీర్ఘకాలంగా వైమానిక దాడులు చేపడుతుండటంతో అగ్రరాజ్య ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 80 శాతం మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్టర్లు, దాదాపు సగం పేట్రియాట్ క్షిపణుల నిల్వలు కరిగిపోయినట్లు ఇటీవల కథనాలు వచ్చాయి.
అయితే, వీటిని ట్రంప్ కొట్టిపారేశారు. తమ వద్ద పెద్ద ఎత్తున ఆయుధ నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేగాక, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. భారీ సంఖ్యలో ప్లాంట్లు, ఫ్యాక్టరీలను రక్షణ రంగ కంపెనీలు నిర్మిస్తున్నాయని తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు.








