హర్మూజ్ తెరిచేందుకు సిద్ధం.. షరతులు వర్తిస్తాయన్న ఇరాన్..!
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పశ్చిమాసియా వార్ లో కీలకంగా మారింది. హర్మూజ్ తెరవాలని అమెరికా.. షరతులు వర్తిస్తాయని ఇరాన్ చెబుతున్నాయి. అయితే హర్మూజ్ తెరవాల్సిందేనని.. లేదంటే బారీ దాడులు తప్పవని అమెరికా హెచ్చరిస్తుండడంతో .. ఇరాన్ కొత్త షరతులు విధించింది. ముఖ్యంగా యుద్ధం విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని స్పష్టం చేసింది.
ఈ వ్యూహాత్మక ప్రాంతం నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది. ఇరాన్‌పై యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని.. దాడుల కారణంగా జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. తమ ఆస్తులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు, విదేశాల్లో స్తంభింపజేసిన నిధులను బేషరతుగా విడుదల చేయాలని కోరింది. ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi), సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బాగెర్ జోల్ఘాదర్ ఈ వివరాలు వెల్లడించారు.
జూన్‌లో కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో హర్మూజ్ జలసంధి విషయంలో కొన్ని అంశాలపై అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. ఆంక్షల సడలింపు, స్తంభించిన ఆస్తుల విడుదల వంటి అంశాలను తుది ఒప్పందంలో చేర్చాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఇరాన్ వైఖరి మారింది. జలసంధిని తెరవాలంటే ఆంక్షల ఎత్తివేత, స్తంభించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతోంది. అమెరికా మాత్రం జలసంధిపై ముందుగా ఒప్పందం కుదరాలని భావిస్తోంది. ఆ తర్వాతే దిగ్బంధనాన్ని ముగించే అంశాన్ని పరిశీలించాలని చూస్తోంది.
ఒమన్(Oman)తో తాము జరుపుతున్న చర్చలు కేవలం నౌకల రాకపోకల సాంకేతిక మార్గాల కోసమేనని.. అమెరికా తమ షరతులు అంగీకరించే వరకు జలసంధి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.








