Ramsar List: రామ్సర్ జాబితాలో మరో రెండు భారతీయ చిత్తడి నేలలు!
అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం (ఫిబ్రవరి 2) సమీపిస్తున్న వేళ భారత్ మరో ఘనత సాధించింది. దేశంలోని మరో రెండు చిత్తడి నేలలకు ప్రతిష్టాత్మక ‘రామ్సర్’ (Ramsar) గుర్తింపు లభించింది. దీంతో భారత్‌లో మొత్తం రామ్సర్ సైట్ల (Ramsar List) సంఖ్య 98కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ‘పాట్నా బర్డ్ శాంక్చురీ’ (Patna Bird Sanctuary), గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న ‘ఛారీ ధండ్’ (Chhari Dhand) చిత్తడి నేలలను కొత్తగా ఈ (Ramsar List) జాబితాలో చేర్చారు. ఇది యూపీలోనే అతి చిన్న పక్షుల కేంద్రం అయినప్పటికీ, జీవవైవిధ్యంలో చాలా గొప్పది. శీతాకాలంలో ఇక్కడికి 60 వేలకు పైగా పక్షులు వలస వస్తాయి. గుజరాత్ కచ్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఛారీ ధండ్ చిత్తడి నేల అరుదైన పక్షులకు, జంతువులకు ఆవాసం. లెస్సర్ ఫ్లెమింగోలు, ఎడారి నక్కలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ (Ramsar List) గుర్తింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. జీవవైవిధ్యాన్ని కాపాడాలన్న భారత నిబద్ధతకు ఇది నిదర్శనమని ట్వీట్ చేశారు. 2014 నుండి ఇప్పటి వరకు రామ్సర్ సైట్ల సంఖ్యలో 276 శాతం వృద్ధి నమోదైందని ఆయన పేర్కొన్నారు.






