Professor: క్లాస్‌రూంలోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ప్రపోజల్.. చెప్పుతో కొట్టిన అమ్మాయి!
గురువు (Professor) అంటే దైవంతో సమానం అంటారు. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ప్రొఫెసర్ తన వృత్తి గౌరవాన్ని, బాధ్యతను గాలికి వదిలేశాడు. ఏకంగా తరగతి గదిలోనే అందరి ముందూ ఒక విద్యార్థినికి ప్రపోజ్ చేసి అభాసుపాలయ్యాడు. ప్రొఫెసర్ విపరీత చేష్టలకు తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు విద్యార్థిని, ఆమె తోటి స్నేహితులు ఆ కీచక ప్రొఫెసర్‌కు చెప్పులతో దేహశుద్ధి చేశారు. బెంగళూరు శివార్లలోని నెలమంగల సమీపంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
అసలేం జరిగిందంటే..
తరగతి గదిలో క్లాస్ జరుగుతుండగా, మైక్ పట్టుకున్న ప్రొఫెసర్ (Professor) అకస్మాత్తుగా.. “మన బ్యాచ్‌లోనే అత్యంత ముఖ్యమైన ఒక అమ్మాయికి నేను ఈ రోజు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను” అని ప్రకటిస్తూ ఓ విద్యార్థిని పేరును ప్రస్తావించాడు. ఇది విన్న వెంటనే ఆ యువతి షాక్‌కు గురై, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతడిని నిలదీసింది.
ఇవి కూడా చదవండి
అయినా సదరు ప్రొఫెసర్ (Professor) ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. “గతంలో నువ్వే నాకు ఐ లవ్ యు చెప్పావు కదా?” అని బుకాయించాడు. దీనికి ఆ విద్యార్థిని “ఎక్స్క్యూజ్ మీ? నేను ఎప్పుడు చెప్పాను? నేను ఎప్పుడూ అలా అనలేదు. నీకు ఏమైనా మాట్లాడాలని ఉంటే ప్రిన్సిపాల్ దగ్గరకు పదా.. మా బ్యాచ్ విద్యార్థులంతా వస్తారు” అని గట్టిగా బదులిచ్చింది. అయినా ఆ ప్రొఫెసర్ వినకుండా “సీసీటీవీ ఫుటేజ్ ఉంది” అన్నాడు. “అయితే ఆ ఫుటేజ్ తీసుకురా.. ఇప్పుడే చూద్దాం” అని విద్యార్థిని సవాల్ చేసింది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ప్రొఫెసర్ “సరే, నేను నీతో రేపు మాట్లాడుతాను” అని క్లాస్ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు.
చెప్పులతో దాడి..
క్లాస్‌రూమ్‌లో అందరి ముందు ప్రొఫెసర్ (Professor) చేసిన అభ్యంతరకర ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. తన తోటి విద్యార్థులతో కలిసి కాలేజీ ఆవరణలోనే అతడిని అడ్డుకుంది. విద్యార్థులంతా మూకుమ్మడిగా ప్రొఫెసర్‌ను చుట్టుముట్టి చెప్పులతో విపరీతంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడంతో నెటిజన్లు ప్రొఫెసర్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ క్యాంపస్‌కు చేరుకున్నారు. వీడియో ఫుటేజీని పరిశీలించి, సదరు విద్యార్థిని, తోటి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి








