కాంగ్రెస్ సమాజ్ వాదీలను చూస్తే ఊసరవెల్లిని చూసినట్లే : మాయావతి విమర్శలు
మహిళా రిజర్వేషన్ చట్టం గురువారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా న్యాయశాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి ట్విట్టర్ వేదికగా సమాజ్ వాదీ, కాంగ్రెస్, బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఊసరవెల్లిని గుర్తు చేస్తున్నాయని, ప్రజలు దాని ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు సంబంధించిన రాజ్యాంగపరమైన, చట్టపరమైన హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందిందని విమర్శించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు విషయంలో సమాజ్ వాదీ, కాంగ్రెస్ రెండూ గట్టిగా వాదిస్తున్నాయని, అయితే.. కాంగ్రెస్ కేంద్రంలో వుండగా.. ఒక్క రంగంలోనూ మహిళా రిజర్వేషన్ కోటాలను భర్తీ చేయడానికి చొరవ తీసుకోలేదని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
మండల్ కమిషన్ నివేదిక సిఫార్సు చేసిన విధంగా, OBC వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో 27 శాతం రిజర్వేషన్ను సమాజ్ వాదీ అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. కానీ.. తమ పార్టీ చేసిన అవిశ్రాంతమైన కృషి ఫలితంగా మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో ఇది ఎట్టకేలకు అమలులోకి వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
అదేవిధంగా, ఉత్తరప్రదేశ్లో—వెనుకబడిన ముస్లింలకు OBC ప్రయోజనాలను విస్తరించాలని సిఫార్సు చేస్తూ—జూలై 1994లోనే వెనుకబడిన తరగతుల కమిషన్ సూచించిందని, దానిని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని మాయావతి తన ట్విట్టర్ పోస్ట్ లో గుర్తు చేశారు. అంతేకాక దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
అయితే 1995 జూన్ 3 న బీఎస్పీ ప్రభుత్వం ఏర్పడిందని, తమ ప్రభుత్వం తక్షణమే ఈ సిఫార్సును అమలు చేసిందని మాయావతి గుర్తు చేశారు. అప్పుడు సమాజ్ వాదీ పార్టీ మహిళల కోసం, బలహీన వర్గాల కోసం ఏమీ చేయలేదని, కానీ.. ఇప్పుడు మాత్రం మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్ కోటాలను కేటాయించాలని వాదించడం విడ్డూరంగా వుందని మాయావతి ఆక్షేపించింది.
మొత్తానికి దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు, ముస్లిం వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చలేదని, వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదని మాయావతి ఆరోపించారు. రాజకీయాలు ఎలా వున్నా.. ప్రస్తుతానికి మాత్రం మహిళలు తమకు వచ్చే ప్రతి ప్రయోజనాన్ని కూడా స్వీకరించాలని మాయావతి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి








