ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో రూపం : మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
జెన్ జీ, నిరసనలు, ఉద్యమాలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్ మెంట్ టు యునైట్ నేషన్స్ సంస్థ 15 వ వార్షికోత్సవం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా హాజరవ్వగా, భారీ సంఖ్యలో జెన్ జీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో రూపమని అభివర్ణించారు. నిరసనలు అనేవి ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా వుండాలే కానీ, విభేదాలకు, విభజనకు దారి తీయవద్దని అభిప్రాయపడ్డారు. అయితే చర్చల తర్వాత కూడా సమస్యకు పరిష్కారం దొరకని పక్షంలో నిరసన మార్గాల వైపు వెళ్లొచ్చన్నారు.కానీ అది విభజన పద్ధతులకు దారి తీయవద్దన్నారు.అయితే జెన్ జీ ఆందోళనలు చేయవద్దని మాత్రం తాను అనడం లేదని భాగవత్ తేల్చి చెప్పారు. అయితే.. ఎలా చేయాలి? ఏం చేయాలి? అన్నది రాజ్యాంగంలో కూడా పొందుపరిచారన్నారు. రాజ్యాంగ నిర్మాణ బాబా సాహేబ్ అంబేద్కర్ కి సంబంధించిన రెండు ఉపన్యాసాల్లో కూడా ఈ పద్ధతి వుందన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సూచించిన మార్గదర్శకాన్ని కూడా ఉటంకించారు.
అయితే జెన్ జీ లేవనెత్తిన సమస్యలు మాత్రం సరైనవేనన్నారు. భారత దేశ విద్యా వ్యవస్థలో చాలా సంస్కరణలు తేవాల్సిన అవసరం వుందన్నారు. అయితే అలా జరగడం లేదన్నారు. అందుకే చర్చలు జరగాలన్నారు. అయితే చర్చల తర్వాత కూడా పరిష్కారం దొరకని పక్షంలో ఏం చేయాలన్నది ఆ తర్వాతి సమస్య అని తెలిపారు. ఏదైనా విభేదాలు తలెత్తినప్పుడు చర్చలే ప్రథమ కర్తవ్యంగా వుండాలన్నారు.
తాము యవ్వన దశలో వున్న సమయంలో తమ పెద్దలు ఏది చెబితే, దానిని వినేవారమని, అప్పట్లో తమ తరం యువకులు అలా వుండేవారని భాగవత్ గుర్తు చేశారు.వారు చెప్పిందే వినేవారం తప్పించి, ఎదురు ప్రశ్నలు వేసేవారమే కాదన్నారు.అయితే.. ఇది అప్పటి పరిస్థితి అని, కానీ.. ఇప్పటి జెన్ జీ ప్రశ్నలు అడుగుతారని, తార్కిక విధానంలో వారికి సమాధానాలు చెప్పాల్సి వుంటుందన్నారు. అలాగే దీనితో పాటు ప్రేమ కూడా దానికి తోడైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
అయితే.. చర్చ అనే విషయంలో ఆంగ్లంలో డిబేట్ అని పిలుస్తారని, కానీ.. మన విధానంలో ‘‘శాస్త్రార్థం’’ (పాండిత్య చర్చ) అని అంటారన్నారు. ఇందులో వాద, ప్రతివాదాలు అన్న పద్ధతి వుండదని, పూర్వ పక్షం, ఉత్తర పక్షం అనే విధానం వుంటుందన్నారు.ఈ శాస్త్రార్థంలో అందరి వాదనలు వింటారని, దీని ద్వారా ఓ కొత్త కోణం స్ఫురిస్తుందన్నారు.అయితే.. రకరకాల వాదనలు ఇందులో బయటికి వస్తాయని, అప్పుడప్పుడు కౌంటర్లు కూడా వస్తాయని, అయితే.. చివరకు మాత్రం సత్యానికి సంబంధించిన అసలైన కోణం ఆవిష్కృతమవుతుందన్నారు.
జెన్ జెడ్ ఆకాంక్షలను సమాజం, సంస్థలు అర్థం చేసుకోవాలని భాగవత్ పిలుపునిచ్చారు. చర్చల ద్వారా, బాధ్యతాయుత పాలన ద్వారా నిజమైన ఆందోళనలను పరిష్కరించాలని కోరారు. ఏ నిరసన అయినా సరే దాని ఉద్దేశం, విధానం, ప్రవర్తన సముచితంగా, గౌరవ ప్రదంగా వుండాలన్నారు. ‘జెన్-జెడ్’ (Gen-Z) తమ గళాన్ని వినిపిస్తున్నప్పుడు, దానిని కేవలం వ్యతిరేకతగా మాత్రమే చూడొద్దని, వారి సవాళ్లను సానుభూతితో అర్థం చేసుకోవాలన్నారు. వీటిని పరిష్కరించడం సమాజం, వ్యవస్థ బాధ్యత అని తెలిపారు.
సోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకోవాలని భాగవత్ సూచించారు. దీనికి కొన్ని నియమాలు రూపొందించాలని, క్రమశిక్షణను కూడా అలవర్చాలని అన్నారు. అయితే.. దృక్పథం మారినప్పుడే అది విజయవంతం అవుతుందన్నారు. ఎన్నో చట్టాలు చేశారని, కానీ.. ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు.
సమాజమే అసలైన చట్టం అని అన్నారు. అలాగే ఆదర్శ ప్రాయుల గురించి కూడా ప్రస్తావించారు. గత తరానికి ఆదర్శప్రాయులు వేరుగా వుండేవారని, కాలక్రమేణా ఆదర్శప్రాయులు కూడా సహజంగానే మారుతూ వుంటారన్నారు. ‘‘ఉదాహరణకు సోషల్ మీడియాలో నా స్థానం ఏమిటి? ఒకవేళ పది లక్షల మంది నేను చేసే పనులను అనుసరిస్తుంటే, నన్ను అనుసరించడం వల్ల ఆ పది లక్షల మంది ఎలాంటి అపాయంలోనూ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. కనీసం ఆపాటి స్పృహ అయినా నాకు ఉండాలి. అదే వివేకం.’’ అని మోహన్ భాగవత్ తెలిపారు.
నేడు సోషల్ మీడియా చాలా సాంకేతికంగా అభివృద్ధి చెందిందని, చాలా దూరం కూడా వెళ్లిందన్నారు. అది మనలాంటి ఫోటోలనే సృష్టించి, మనతో మాట్లాడించడం, మన గొంతును అనుకరించడం, మనం అనని మాటలను కూడా అన్నట్లు భ్రమింపజేయడం వరకూ వెళ్లిందన్నారు. ఉదాహరణకు నకిలీ వీడియోలు వంటివి) వంటివి చేయగలదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు విశ్వసనీయమైన మూలాల ద్వారానే వాటిని నిర్ధారించుకోవాలని సూచించారు. విశ్వాసం లేకుండా దేనినీ విశ్వసించవద్దని పిలుపునిచ్చారు.
పాక్ చైనాతో ఘర్షణలు లేనప్పుడు చర్చలను కొనసాగించాలని భాగవత్ సూచించారు. శాశ్వత శత్రుత్వం, విద్వేషం ఏమాత్రం సరికావన్నారు. స్వలింగ సంపర్కంపై కూడా భాగవత్ స్పందిస్తూ, స్వలింగ జంటలకు అవసరమైన సామాజిక, న్యాయపరమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం వుందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇప్పుడున్న వివాహ వ్యవస్థను నష్టపరిస్తే తప్పుడు పరిణామాలు తలెత్తుతాయని అన్నారు.








