కీలక దశలో ఉన్నాం…మరింత సాయం
రష్యా దురాక్రమణ నుంచి తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఇప్పుడు కీలకమైన మలుపు తీసుకోబోతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. పాశ్చాత్య దేశాలు తమకు మరింత సాయాన్ని అందించాలని ఇంకోసారి అభ్యర్థించారు. శాంతి చర్చలు ముందుకు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ యథావిధిగా బాంబుల మోత మోగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ చట్టసభల సభ్యులనుద్దేశించి వేర్వేరుగా ఆయన మాట్లాడారు. రష్యా నుంచి దిగుమతులు చేసుకోవద్దనీ, ఆ దేశానికి చెందిన నౌకలపై అంతర్జాతీయ ఓడరేవుల్లో నిషేధం విధించాలని కోరారు. రష్యాతో చర్చలు మాటాల్లోనే తప్పిస్తే చేతల్లో లేవని పెదవి విరిచారు.
ఉక్రెయిన్లోని ఇర్పిన్, మకరీవ్ వంటి నగరాలు, పట్టణాలపై రష్యా బాంబుల దాడి నిరాఘాతంగా కొనసాగింది. కీవ్ శివార్లలో ఉక్రెయిన్ తిరిగి స్వాధీనపరచుకున్న ప్రాంతాలపైనా గుళ్ల వర్షం కురిసింది. బలగాలను తగ్గించుంటామని హామీ ఇచ్చిన ప్రాంతాలనూ వదిలిపెట్టలేదు. ఇంధన డిపోలు, ఆయుధాగారాలే లక్ష్యంగా చెర్నిహైవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఫిరంగులు, క్షిపణుల మోత మోగిందని బ్రిటన్ ధ్రువీకరించింది.













