ఉక్రెయిన్ కు గెరాన్-5 డ్రోన్ టెన్షన్..
ఉక్రెయిన్ వార్ లో భాగంగా రష్యా బరిలోకి దించిన గెరాన్ -5 డ్రోన్లు.. కీవ్ కు చమటలు పట్టిస్తున్నాయి.
సుదూర లక్ష్యాలను ఛేదించే ఈ డ్రోన్లు జెట్-ఇంజిన్‌తో పనిచేస్తాయి. అందుకే వీటిని ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
ఉక్రెయిన్ వైమానిక దళ ప్రతినిధి కల్నల్ యూరి ఇగ్నాట్, సెప్టెంబర్ 14న ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. రష్యా గెరాన్-5 డ్రోన్లతో దాడులు చేస్తోందని, అయితే వాటిలో కేవలం 60 శాతం దాడులను మాత్రమే తాము అడ్డుకోగలుగుతున్నామని చెప్పారు. సాధారణంగా ఇతర రకాల డ్రోన్లతో జరిగే దాడులను ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు 95 శాతం వరకు విజయవంతంగా అడ్డుకుంటున్నాయని అన్నారు. అయితే గెరాన్-5 డ్రోన్లను మాత్రం అవి సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నాయని స్పష్టం చేశారు.
క్రూయిజ్ మిస్సైల్ తరహాలో!
గెరాన్-5 డ్రోన్ ఆకారం చాలా భిన్నంగా ఉంటుంది. సంప్రదాయ లాంగ్-రేంజ్ డ్రోన్లలాగా కాకుండా ఒక క్రూయిజ్ మిస్సైల్ లాగా గెరాన్-5 డ్రోన్స్ ఉంటాయి. రష్యన్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది 1000 కి.మీ దూరం వరకు ప్రయాణించగలదు. గరిష్ఠంగా 6వేల మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. అది సాధారణ డ్రోన్లు ఎగరేదాని కంటే చాలా ఎక్కువ ఎత్తు కావడం గమనార్హం. పైగా ఇవి పాత మోడల్స్ కంటే చాలా వేగంగా దూసుకెళ్తాయి. వీటి గరిష్ఠ వేగం గంటకు సుమారు 600 కి.మీ ఉంటుందని అంచనా. పైగా వీటిలో ‘యాంటీ-జామింగ్’ సాంకేతికతను అమర్చారు. అందుకే ఈ సరికొత్త డ్రోన్లను ఉక్రెయిన్ భూతల వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నాయి.
ఆగస్టు నుంచి దాడులు స్టార్ట్!
రష్యా ఈ ఆగస్టు నుంచి ఈ గెరాన్-5 డ్రోన్లతో దాడులు ప్రారంభించిందని ఉక్రెయిన్ వైమానిక దళ ప్రతినిధి కల్నల్ యూరి ఇగ్నాట్ తెలిపారు. వాటిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ఏకంగా ఫైటర్ జెట్లను ఉపయోగించాల్సి వస్తోందని, పైలట్లు వాటిని నేరుగా గాల్లోనే కాల్చివేస్తున్నారని ఆయన చెప్పారు.
2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. మొదట్లో ఇరుపక్షాలు యుద్ధ విమానాలపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. ఆ యుద్ధ విమానాలు నేరుగా ఒకదానితో ఒకటి పోరాడేవి. అలాగే భూమిపై ఉన్న తమ దళాలకు మద్దతుగా శత్రు లక్ష్యాలపై దాడులు చేసేవి. అయితే తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. ఇరుపక్షాల వైమానిక రక్షణ వ్యవస్థలు- యుద్ధ విమానాలకు భారీ నష్టాన్ని కలిగించాయి. దీనితో వ్యూహం మార్చిన ఇరుదేశాలు, నేరుగా తలపడకుండా, సుదూర ప్రాంతాల నుంచి దాడులు చేసుకోవడం ప్రారంభించాయి.
2023 నుంచి రష్యా గ్లైడ్ బాంబులను పూర్తి స్థాయిలో ఉపయోగించడం ప్రారంభించింది. వీటిని లక్ష్యానికి దాదాపు 70 కి.మీ దూరం నుంచే ప్రయోగించవచ్చు. పైగా ఇది చాలా యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ రక్షణ వ్యవస్థల పరిధికి అవతల ఉంటుంది. అందు వల్ల యుద్ధభూమిలో బాంబుదాడులు చేయడానికి దీనిని రష్యన్లు ఉపయోగించారు. ఆ తర్వాత యుద్ధరంగంలో డ్రోన్లు వాడడం ప్రారంభమైంది. వీటి వల్ల సైనికుల ప్రాణాలకు రిస్క్ లేకుండా పోయింది. పైగా వీటి తయారీ చాలా సులభం. తక్కువ ఖర్చుతో పెద్ద సంఖ్యలో డ్రోన్లు తయారు చేయవచ్చు. అందుకే ఇరుదేశాలు డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకోవడం ప్రారంభించాయి. చిన్నరకం డ్రోన్లను ఇరుపక్షాలు సరిహద్దు యుద్ధ రంగాల్లో ఉపయోగించాయి. పెద్ద, లాంగ్ రేంజ్ డ్రోన్లను శత్రు భూభాగం లోపల ఉన్న లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టాయి. అయితే పాత లాంగ్ రేంజ్ డ్రోన్లలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే, వాటిని సులభంగా కూల్చేయవచ్చు. ఎందుకంటే అవి ప్రొపెల్లర్స్‌తో నడవడం వల్ల వేగం చాలా తక్కువగా ఉంటుంది. రష్యా ఇంతకు ముందు ఇలాంటి ప్రొపెల్లర్స్‌తో నడిచే గెరాన్-1, గెరాన్-2 డ్రోన్లను వాడింది. వాస్తవానికి ఇవి ఇరాన్‌కు చెందిన షాహెద్-136 డ్రోన్‌కు, రష్యా చేసిన అప్‌గ్రేడెడ్ కాపీలు మాత్రమే.
కానీ ఆ తర్వాత రష్యా తన వ్యూహాన్ని మార్చింది. జెట్ పవర్డ్ డ్రోన్ అయిన గెరాన్-3ని 2025లో రంగంలోకి దింపింది. గెరాన్-2 వేగం గంటకు 185 కి.మీ మాత్రమే ఉంటే, గెరాన్-3 వేగం గంటకు 330 కి.మీ. అయితే గెరాన్-2 పరిధి 2,500 కి.మీ ఉండగా, గెరాన్-3 పరిధి కేవలం 600 కి.మీ మాత్రమే. అయినప్పటికీ ఇవి గెరాన్-3 తన పాత వెర్షన్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగరగలగడం వల్ల ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోగలిగింది. ఇక అదే ఏడాది చివర్లో జెట్-పవర్డ్ గెరాన్-4ను రష్యా యుద్ధరంగంలోకి తెచ్చింది. ఇది గంటకు 500 కి.మీ వేగం, 850 కి.మీ రేంజ్ కలిగిన డ్రోన్. ఇప్పుడు 2026 ఆగస్టులో దానికి మించిన వేగం కలిగిన గెరాన్-5ను రష్యా దళాలు వాడడం ప్రారంభించాయి.
ఉక్రెయిన్ సైనిక ఇంటెలిజెన్స్ ప్రకారం, ఈ గెరాన్-5 డ్రోన్లను రష్యా విదేశీ సాంకేతికతో తయారు చేస్తోంది. ముఖ్యంగా చైనా సరఫరా చేసిన జెట్ ఇంజిన్, అమెరికాలో తయారైన డిజిటల్ ప్రాసెసర్లు, జర్మనీకి చెందిన ట్రాన్సిస్టర్లను ఈ డ్రోన్స్ తయారీలో వాడారు. ఈ విడి భాగాల జాబితాను చూస్తే, పాశ్చాత్య దేశాల ఆంక్షలను అధిగమించి, వివిధ దేశాల నుంచి వాణిజ్యపరంగా లభించే సాంకేతికను రష్యా ఎలా సేకరిస్తోందో తెలుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే, విదేశీ సంకేతికతను సంపాదించి, ఆపై దేశీయంగా డ్రోన్లను తయారు చేసే బలమైన సరఫరా వ్యవస్థను రష్యా ఏర్పాటు చేసుకుందని తెలుస్తోంది.








