ఇరాన్ పై విజయానికి దగ్గరలో ఉన్నాం.. ట్రంప్ విశ్వాసం..!
ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో విజయానికి ముంగిట ఉన్నామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే తాము భీకర దాడులు చేసే అవకాశం కూడా ఉందని సంకేతాలిచ్చారు. పశ్చిమాసియాలో ఈ ఘర్షణలు ముగిస్తే, ప్రపంచ చమురు ధరలు తీవ్రంగా పడిపోతాయని ట్రంప్ తెలిపారు. టెహ్రాన్‌కు అణ్వాయుధాలను దక్కకుండా చేయడమే అమెరికా ప్రాథమిక లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
సైనిక ఒత్తిడి, ఆర్థిక ఆంక్షలు ద్వారా ఇరాన్‌పై అమెరికా విజయం సాధిస్తుందా? అని అడిగినప్పుడు, ట్రంప్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అమెరికా ఈ రెండు విధాలుగానూ పురోగతి సాధిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ‘‘సైనిక కోణంలో చూస్తే మనం ఇప్పటికే విజయం సాధించాం. అంతమాత్రాన మనం ఆ ప్రయత్నాలను ఆపేశామని అర్థం కాదు’’ అని ట్రంప్ అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇక ఆర్థిక ఒత్తిడి ప్రభావం గురించి మాట్లాడుతూ, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు ట్రంప్. ‘‘మనం కచ్చితంగా భారీ విజయాన్ని సాధిస్తున్నాం. వారి ఆర్థిక వ్యవస్థను చూస్తే, అది కనుమరుగైపోయింది. వారికి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటూ ఏమీ లేదు. వారి డబ్బు విలువ ఏమాత్రం విలువలేనిదిగా మారింది. మన దగ్గరా ద్రవ్యోల్బణం ఉంది. కానీ వారి దగ్గర ఇప్పుడు దాదాపు 300 శాతం మేర ద్రవ్యోల్బణం ఉంది. వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. సైనిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది’’ అని ట్రంప్ వెల్లడించారు.








