Air India Flight: 7 గంటల పాటు గాల్లో తిరిగి.. రిటర్న్ వచ్చిన విమానం!
లండన్ వెళ్లాల్సిన ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. ఉదయం దిల్లీలో బయలుదేరిన ఓ ఎయిరిండియా విమానం (Air India Flight).. ఏకంగా ఏడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి, చివరకు ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడే ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడు గంటల పాటు గాల్లోనే టెన్షన్ టెన్షన్‌గా సాగిన ఈ ప్రయాణంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అసలేం జరిగిందంటే..
ఢిల్లీ నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి (London Heathrow) వెళ్లాల్సిన ఎయిరిండియా (Air India Flight) ప్యాసింజర్ ఫ్లైట్ ఉదయం 6.13 గంటలకు టేకాఫ్ అయింది. ప్రయాణం సవ్యంగానే సాగుతుందనుకున్న దశలో, విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి (Saudi Arabia Airspace) ప్రవేశించిన తర్వాత అకస్మాత్తుగా వెనుతిరిగింది. ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం, అప్పటికే ఆ విమానం సుమారు 3,300 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఆ పాయింట్ నుంచి లండన్ చేరుకోవడానికి ఇంకా ఆరు, ఏడు గంటల ప్రయాణ సమయం పడుతుంది. కానీ, గాల్లోనే యూ-టర్న్ తీసుకున్న ఈ విమానం (Air India Flight) మధ్యాహ్నం 1.00 గంట ప్రాంతంలో తిరిగి దిల్లీలోనే ల్యాండ్ అయింది.
ఇవి కూడా చదవండి
వింత శబ్దాలతో అప్రమత్తం
ఈ అనూహ్య పరిణామానికి ప్రధాన కారణం సాంకేతిక లోపమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణ సమయంలో విమానం (Air India Flight) ఇంజిన్ లేదా క్యాబిన్ పరిసరాల నుంచి కొన్ని అసాధారణ శబ్దాలు (Unusual noises) రావడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వెంటనే వెనక్కి మళ్లించినట్లు సమాచారం. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం అధికారికంగా స్పందిస్తూ.. “భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విమానాన్ని ఢిల్లీకి మళ్లించాం. అది అత్యంత సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం మా ఇంజినీరింగ్ బృందం విమానంలో పూర్తిస్థాయి సాంకేతిక తనిఖీలు (Technical checks) నిర్వహిస్తోంది. ఈ మరమ్మతుల ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం” అని ఒక ప్రకటనలో పేర్కొంది.
టెన్షన్ పెడుతున్న ట్రాక్ రికార్డ్!
అయితే ఇక్కడ అత్యంత ఆందోళన కలిగించే విషయం మరొకటి ఉంది. గాల్లో కలకలం రేపిన ఇదే విమానానికి (Air India Flight) గతంలోనూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సరిగ్గా పది రోజుల క్రితం (మార్చి 15న) ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు (New York) బయలుదేరిన ఇదే విమానాన్ని.. గాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ఐర్లాండ్‌కు మళ్లించారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఒకే విమానం పదేపదే ఇలా సాంకేతిక లోపాలకు గురై దారి మళ్లాల్సి రావడం విమానయాన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమానాల నిర్వహణ (Maintenance) విషయంలో ఎయిరిండియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో భద్రతా సంస్థలు దీనిపై మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








