తెలుగుటైమ్స్ ఎడిటర్ సి.వి. సుబ్బారావుకు శ్రీకళాసుధ ఉగాది పురస్కారం

తెలుగుటైమ్స్ ఎడిటర్ సి.వి. సుబ్బారావుకు శ్రీకళాసుధ ఉగాది పురస్కారం

08-04-2019

తెలుగుటైమ్స్ ఎడిటర్ సి.వి. సుబ్బారావుకు శ్రీకళాసుధ ఉగాది పురస్కారం

చెన్నై నగరంలో పేరు పొందిన శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్‌ 21వ ఉగాది పురస్కారాల వేడుక మైలాపూర్‌లోని మ్యూజిక్‌ అకాడమీలో ఏప్రిల్‌ 7వ తేదీన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు, మహిళ రత్న పురస్కారాలు, సినీ, పారిశ్రామికరంగాల్లో పేరు పొందిన ప్రముఖుల ఉపన్యాసాలు, సత్కారాలతోపాటు సాంస్కృతిక కళా ప్రదర్శనలు అతివైభవంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, పంచాంగ పఠనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీకళాసుధ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్‌ అందరికీ స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫీనిక్స్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశిష్ట దాత, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా హానరరీ కాన్సులేట్‌ జనరల్‌ (హైదరాబాద్‌) సురేష్‌ చుక్కపల్లి, విశిష్ట అతిధిగా వ్యూచరిస్టిక్‌ సిటీస్‌ అధ్యక్షురాలు కరుణా గోపాల్‌, గౌరవ అతిధిగా గానకోకిల, పద్మభూషణ్‌ పి. సుశీల, ప్రత్యేక ఆహ్వానితులుగా నెక్ట్‌వేవ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండి ఎన్‌.టి. చౌదరి, మహానటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి హాజరయ్యారు.

బాపు బొమ్మ పురస్కారాన్ని ప్రముఖ నటి సుహాసినికి, బాపు రమణల పురస్కారాన్ని సినీ పబ్లిసిటీ డిజైనర్‌ సురేష్‌కు ఇచ్చారు. ఉత్తమ చిత్రంగా మహానటి (వైజయంతీ మూవీస్‌) చిత్రానికి అవార్డును అందజేశారు. ఉత్తమ నటి అవార్డును కీర్తిసురేష్‌కుగాను ఆమె రాలేకపోయినందున ఆమె తల్లికి ఈ అవార్డును అందజేశారు. ఉత్తమ దర్శకుడి అవార్డును రంగస్థలం చిత్రం దర్శకుడు సుకుమార్‌కు ఇచ్చారు. ఉత్తమ సంచలనాత్మక చిత్రంగా రంగస్థలంకు అవార్డు ఇచ్చారు. మహిళారత్న పురస్కారాన్ని  వైదేహి గ్రూపు ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ డైరెక్టర్‌ శ్రీమతి కల్పజ దళవాయికి ఇచ్చారు.  ఉత్తమ నూతన దర్శకుని అవార్డును వెంకీ అట్లూరి (తొలిప్రేమ)కి ఇచ్చారు. ఉత్తమ హాస్యనటి అవార్డును విద్యుల్లేఖరామన్‌కు, ఉత్తమ నేపథ్యగాయని అవార్డును చిన్మయి శ్రీపాదకు ఇచ్చారు. ఉత్తమ నూతన నిర్మాత అవార్డును కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటికి ఇచ్చారు.

విశిష్ట ఉగాది పురస్కార అవార్డును తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ సి.వి. సుబ్బారావుకు ఇచ్చారు. అనుఫాంట్స్‌ క్రియేటర్‌ ఎస్‌. మురళీ కృష్ణ, ఢిల్లీలోని ఎన్‌ఐఐఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.ఎస్‌. ప్రకాశరావుకు, డాక్టర్‌ రైస్‌ను సృష్టించిన ఎం. రామారావుకు, చెన్నైలో ఉన్న గ్లోబల్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ రజనీకాంత్‌ పచ్చ, నిర్మాత దిల్‌రాజుకు కూడా విశిష్ట ఉగాది పురస్కార అవార్డును ఇచ్చారు.

Click here for Event Gallery