కేన్సర్ వేగానికి ప్రొటీన్ కళ్లెం!
కేన్సర్ కణాల వృద్ధి రేటును మందగించేలా చేసే సరికొత్త విధానాన్ని కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రాణాంతక కేన్సర్లకు ఓ వినూత్న చికిత్సను కనుగొనేందుకు ఈ విధానం తోడ్పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేన్సర్ కణాలలో సమృద్ధిగా ఉండే టూడర్ ఎస్ఎన్ అనే ప్రొటీన్‌ను తొలగించడం ద్వారా ఇది సాధ్యమేనని అన్నారు. సాధారణంగా కేన్సర్ కణం వేగంగా ఎదిగి, ఓ స్థాయికి చేరాక వివిధ కణాలుగా విడిపోతుంది. ఈ ప్రక్రియలో కణాల ఎదుగుదలకు టూడర్ ఎస్ఎన్ ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రొటీన్‌ను గుర్తించి, దానిని తొలగిస్తే కణ విభజన ఆలస్యం అవుతుంది. తద్వారా కేన్సర్ విస్తరణ నెమ్మదిస్తుందని పరిశోధకులు వివరించారు.













