MATA ఆధ్వర్యంలో బోస్టన్ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
అమెరికాలోని బోస్టన్ నగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను మాన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇతర తెలుగు సంఘాలు, సంస్థలు మరియు స్థానిక తెలుగు సమాజం అందించిన సహకారం, సమన్వయంతో ఈ వేడుకలు ఘన విజయాన్ని సాధించాయి.
ఈ కార్యక్రమాన్ని తక్కళ్లపల్లి అరవింద్, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, రమేష్ గెంటియాల, శంతన్ తాళ్లపల్లి తదితరుల సమన్వయంతో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. కార్యక్రమ విజయానికి MATA ప్రధాన నిర్వాహక సంస్థగా ముందుండగా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (IAGB), ఇండియన్ అమెరికన్స్ ఇన్ బర్లింగ్టన్ (IAB) తదితర సంస్థలు తమ పూర్తి సహకారాన్ని అందించాయి.
సుమారు 1200 మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా పాల్గొన్న ఈ వేడుకలు తెలంగాణ పల్లె వాతావరణాన్ని తలపించేలా ఎంతో ఉత్సాహంగా, కోలాహలంగా సాగాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించి, బతుకమ్మ పాటలు, కోలాటాలు మరియు నృత్యాలతో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాధ పెటారో, హారిక కృష్ణ గారు కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహభరితంగా యాంకరింగ్ చేస్తూ చక్కగా సమన్వయం చేశారు. వారి అద్భుతమైన నిర్వహణతో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. బతుకమ్మల చుట్టూ అందరూ ఒకేచోట చేరి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వేడుకలకు హాజరైన అతిథులు, ప్రతినిధులు, కుటుంబ సభ్యులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకుల ఆధ్వర్యంలో రుచికరమైన సంప్రదాయ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం మొత్తం కుటుంబ సమేతంగా ఆనందించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ:
“అమెరికాలో వేలాది మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు పండుగల విశిష్టతను మన భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో MATA ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయంగా నిలిపేందుకు సహకరించిన IAGB, IAB మరియు ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన రాధ పెటారో, హారిక కృష్ణ గార్లకు, నిర్వాహక బృంద సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, స్పాన్సర్లకు మరియు ముఖ్యంగా కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ MATA తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.” అని తెలిపారు.
తెలుగు సంఘాల ఐక్యతకు, మన సంస్కృతి పరిరక్షణకు బతుకమ్మ వేడుకలు ఒక గొప్ప వేదికగా నిలిచాయని నిర్వాహకులు పేర్కొన్నారు.








