నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల (బాలల) తేదీల మార్పు: డా. గజల్ శ్రీనివాస్
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల (బాలల) నిర్వహణ తేదీలను మార్చినట్లు పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. తొలుత డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఈ మహాసభలను, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో , పలు ప్రవాస తెలుగు సంఘాల అభ్యర్థన మేరకు 2026 డిసెంబర్ 19, 20 తేదీలకు మార్చినట్లు ఆయన వెల్లడించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ వేడుకలు జరగనున్నాయి. బాలబాలికల్లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని, వివిధ దేశాల నుంచి 16 సంవత్సరాలలోపు పిల్లలు వేలాదిగా హాజరై తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని సమన్వయకర్తలు డా. కె. మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్ తెలిపారు. మారిన తేదీలను గమనించి అందరూ ఈ మహాసభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.








