క్రియేటర్లు Netflixకి వెళ్లకుండా YouTube కోట్ల ఆఫర్లు! అసలు ఎందుకీ పోటీ?
ఒక్కసారి ఊహించండి…
మీరు ప్రతిరోజూ YouTubeలో చూసే ఒక వ్యక్తి రేపటి నుంచి అక్కడ కనిపించకపోతే? అదే వీడియోలు Netflixలో మాత్రమే కనిపిస్తే? మీరు నెట్ ప్లిక్స్ కు షిఫ్ట్ అయ్యిపోతారా..లేక యూట్యూబ్ లోనే పాత వీడియోలే చూస్తారా…చూడరు కదా..నెట్ ప్లిక్స్ కు అతని కంటెంట్ కోసం షిఫ్ట్ అయ్యిపోతారు కదా… ఇదే ఇప్పుడు YouTubeకు మొదలైన భయం.
ఎందుకంటే…Netflix ఇప్పటికే ప్రముఖ YouTube క్రియేటర్లను తన ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్లడం మొదలుపెట్టింది. కొన్ని సందర్భాల్లో వారి వీడియోలు YouTubeలో వచ్చిన రోజే Netflixలోనూ కనిపించేలా ఒప్పందాలు చేసుకుంది. మరికొన్ని సందర్భాల్లో మాత్రం కొత్త కంటెంట్‌ను Netflixకే ప్రత్యేకంగా ఇచ్చేలా భారీ డీల్స్ చేస్తోంది.
YouTube కూడా తగ్గేదేలే…
ఈ కొత్త ట్రెండ్ గమనించిన యూట్యూబ్ వెంటనే మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కొంతమంది ప్రముఖ క్రియేటర్లకు YouTube మిలియన్ల డాలర్ల ఆఫర్లు ఇస్తోంది. కొంతకాలం పాటు తమ వీడియోలను Netflixకు ఇవ్వకుండా YouTubeలోనే ఉంచితే.. వారి కార్యక్రమాలకు నేరుగా డబ్బు పెట్టడం, పెద్ద బ్రాండ్ డీల్స్‌లో భాగం కల్పించడం వంటి ప్రతిపాదనలు చేస్తోంది.
అంటే సింపుల్‌గా చెప్పాలంటే… “Netflix నీ వీడియోలను తీసుకెళ్లకుండా ఉండాలంటే ఎంత కావాలి?” అనే స్థాయికి పోటీ చేరింది.
అసలు Netflixకు YouTubers ఎందుకు కావాలి?
దీనికి పెద్దగా తల బ్రద్దలు కొట్టుకుని ఆలోచించేటంత స్ట్రాటజీలు ఏమీ లేవు. Netflix దగ్గర కోట్లాది మంది ప్రేక్షకులు ఉన్నారు. కానీ ప్రతిరోజూ కొత్త ప్రేక్షకులను Netflix వైపు లాగడానికి కొత్త ముఖాలు కావాలి.
ఇక్కడే YouTubers వారికి కనపడ్డారు. ఓ రాయి వేసి చూసారు. అది తగిలింది. ఒక పెద్ద YouTuberకు ఇప్పటికే లక్షలు, కోట్ల మంది ఫాలోవర్లు ఉంటారు. అతను ఎక్కడ వీడియో పెడితే అక్కడికి ప్రేక్షకులు వెళ్లే అవకాశం ఉంటుంది.
అందుకే Netflixకు ఒక కొత్త సినిమా స్టార్‌ను తయారు చేయడం కంటే.. ఇప్పటికే ప్రేక్షకులను కలిగి ఉన్న YouTuberను తన ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం సులభంగా భావించింది. Ms. Rachel, Mark Rober, Sidemen, Rhett & Link, Nick DiGiovanni, Alan Chikin Chow, Stokes Twins వంటి పేర్లతో Netflix ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది.
వర్కవుట్ అయ్యిందా?
2026 తొలి ఆరు నెలల్లో Ms. Rachel కంటెంట్‌ను Netflixలోనే 69 మిలియన్ సార్లు చూశారు. అంటే Netflixకు ఇది కేవలం ప్రయోగం కాదు. వర్కవుట్ అయ్యిన బిజినెస్ మోడల్.
YouTubeకు ఎందుకు టెన్షన్?
ఇదే అసలు ట్విస్ట్. YouTube బలం సినిమాలు, వెబ్ సీరిస్ లు కాదు. YouTube బలం YouTubers. MrBeast, Mark Rober లాంటి క్రియేటర్లు లేకపోతే YouTubeలో ప్రేక్షకులను ప్రతిరోజూ తిరిగి తీసుకొచ్చే శక్తిలో పెద్ద భాగం తగ్గిపోతుంది.
ఇన్నాళ్లూ YouTube అనుకుంది.. “క్రియేటర్లు మాతోనే ఉంటారు. వాళ్ల ప్రేక్షకులు ఇక్కడే ఉన్నారు కదా.” అని. కానీ Netflix వచ్చి చెప్పింది.. “క్రియేటర్ ఎక్కడికి వెళ్తే ప్రేక్షకులు అక్కడికే వస్తారు.” ఈ రెండు ఆలోచనల మధ్యే అసలు యుద్ధం మొదలైంది.
ఇది క్రియేటర్లకు ఎందుకు పెద్ద విషయం?
ఇప్పటివరకు ఒక YouTuberకు డబ్బు వచ్చే మార్గాలు ప్రధానంగా ప్రకటనలు, బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, మెంబర్షిప్స్. ఇకపై మరో మార్గం కూడా కనిపిస్తోంది. ప్లాట్‌ఫామ్‌లు నేరుగా క్రియేటర్ల కోసం పోటీ పడటం.
Netflix ఒక ఆఫర్ ఇస్తుంది.
YouTube దానికి మరో ఆఫర్ ఇస్తుంది.
మరో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇంకాస్త ఎక్కువ ఇస్తుంది.
అప్పుడు ఒక క్రియేటర్ విలువ కేవలం అతని వీడియోల వ్యూస్‌తో నిర్ణయించబడదు. అతని ప్రేక్షకులను ఎక్కడికి తీసుకెళ్లగలడు? అన్నదీ విలువ అవుతుంది. ఓ రకంగా ఇది సినిమా ప్రపంచంలో స్టార్ హీరోలకు ఉన్న మార్కెట్లాంటిదే. ఒకప్పుడు నిర్మాతలు హీరో కోసం పోటీ పడేవారు. ఇప్పుడు స్ట్రీమింగ్ కంపెనీలు క్రియేటర్ల కోసం పోటీ పడుతున్నాయి.
మరి సామాన్య ప్రేక్షకుడికి దీని వల్ల ఏం మారుతుంది?
ఇదే ఇంట్రస్టింగ్ విషయం. రేపు మీరు ఎప్పటిలాగే YouTube ఓపెన్ చేస్తారు. మీకు నచ్చిన YouTuber కొత్త వీడియో కనిపించదు. “Full video on Netflix” అని కనిపించవచ్చు. అప్పుడు మీరు Netflix సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి రావచ్చు. అంటే ఈ యుద్ధం YouTube, Netflix మధ్య జరుగుతున్నట్టు కనిపించినా.. చివరికి దాని ప్రభావం మన జేబుపైనే పడొచ్చు. ఇక ఒకే వ్యక్తి వీడియో చూడటానికి రెండు మూడు ప్లాట్‌ఫామ్‌ల సబ్స్క్రిప్షన్లు అవసరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు.
అసలు మార్పు ఇక్కడే ఉంది
ఇప్పటివరకు మనం Netflix, YouTubeలను రెండు వేర్వేరు ప్రపంచాలుగా చూశాం. Netflix అంటే సినిమాలు, సిరీస్‌లు. YouTube అంటే సాధారణ వ్యక్తులు చేసే వీడియోలు. కానీ ఆ గీత ఇప్పుడు చెరిగిపోతోంది.
YouTubeలో పుట్టిన క్రియేటర్లు Netflixలోకి వెళ్తున్నారు. Netflix మాత్రం YouTube క్రియేటర్లను తన కంటెంట్ లైనప్‌లో భాగం చేసుకుంటోంది.
అంటే ఒక వ్యక్తి ఉదయం YouTubeలో వీడియో చేయొచ్చు. అదే వ్యక్తి సాయంత్రం Netflixలో షో చేయొచ్చు. అతని podcastకు Spotify డబ్బులు చెల్లించొచ్చు. బ్రాండ్లు అతని కోసం కోట్ల రూపాయలు పెట్టొచ్చు. అప్పుడు అసలు పవర్ ఎక్కడ ఉంటుంది? ప్లాట్‌ఫామ్ దగ్గర కాదు. ప్రేక్షకులను తన వెంట తీసుకెళ్లగల వ్యక్తి దగ్గర ఉంటుంది.
అందుకే YouTube ఇప్పుడు Netflixతో కేవలం వీడియోల కోసం పోరాడటం లేదు. తన భవిష్యత్తును తయారు చేసిన క్రియేటర్లను వేరే ప్లాట్‌ఫామ్‌కు వెళ్లకుండా ఆపుకోవడానికి పోరాడుతోంది. ఇది ఒక కొత్త డిజిటల్ యుగ యుద్దానికి సంకేతం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








