బడ్జెట్ విషయంలో నాని ఈసారి ప్రూవ్ చేసుకోవాల్సిందే!
నేచురల్ స్టార్ నాని(nani) కెరీర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాల్లో ది ప్యారడైజ్(the paradise) ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాణానికి అనుకున్న దానికంటే ఎక్కువ టైమ్, బడ్జెట్ వెచ్చించాల్సి వచ్చిందనే విమర్శలు వినిపించాయి. షూటింగ్ రోజులు పెరగడం, నిర్మాణ వ్యయం అదుపు తప్పిందనే అభిప్రాయాలు సినిమా రిలీజ్ తర్వాత చర్చనీయాంశమయ్యాయి. డైరెక్టర్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం కంటే, నిర్మాత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నాని వ్యవహరించాల్సిందనే కామెంట్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమా రిజల్ట్ తోపాటు బడ్జెట్ పై కూడా నాని పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇప్పుడు నాని తన నెక్ట్స్ మూవీ బ్లడీ రోమియో(Bloddy romeo)తో బిజీ కానున్నారు. సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ అక్టోబర్ 17 నుంచి ఢిల్లీలో మొదలు కానున్నట్లు సమాచారం. షూటింగ్ లో ఎక్కువ భాగాన్ని లండన్లో నిర్వహించేందుకు ప్లాన్స్ రెడీ చేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ను రెడీ చేసుకుని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కు తగిన టైమ్ కేటాయించడంతో ఈసారి షూటింగ్ను పక్కా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలనే టార్గెట్ తో చిత్ర బృందం ముందుకు సాగుతోంది.
అయితే బ్లడీ రోమియో కూడా భారీ బడ్జెట్ తో రూపొందనున్న సినిమా కావడంతో నాని ముందు అసలు సవాలు బడ్జెట్ కంట్రోలే. అనవసరపు ఖర్చులు, షూటింగ్ ఆలస్యం కారణంగా పెట్టుబడిపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రిలీజ్ కు ముందే పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేలా బిజినెస్ ప్రణాళికలు రూపొందించడం కూడా కీలకం. ది ప్యారడైజ్ విషయంలో ఎదురైన విమర్శలు పునరావృతం కాకుండా, నిర్ణీత సమయంలో, అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేయగలిగితేనే నాని తన నిర్మాణ ప్రణాళికలపై విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుంది.








