విపత్తులోనూ మానవత్వం.. నేపాల్‌కు చేరుకున్న సోనూ సూద్!
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు నటుడు, సామాజిక సేవాకార్యకర్త సోనూ సూద్(Sonusood) స్వయంగా రంగంలోకి దిగారు. సూద్ చారిటీ ఫౌండేషన్ బృందంతో కలిసి భారత్ నుంచి సహాయక సామగ్రిని తీసుకుని ఖాట్మాండుకు చేరుకున్న ఆయన, వరద ప్రభావిత కుటుంబాలను కలుసుకుని వారి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఆహార పదార్థాలు, దుప్పట్లు వంటి అత్యవసర వస్తువుల పంపిణీతో పాటు బాధితులకు ప్రస్తుతం అత్యవసరంగా ఏం అవసరమో క్షేత్రస్థాయిలో అంచనా వేస్తున్నట్లు సమాచారం.
తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఒకటైన నువాకోట్ను కూడా సోనూ సూద్ సందర్శించారు. వరదల్లో ఇళ్లు, జీవనోపాధిని కోల్పోయిన కుటుంబాలతో మాట్లాడి వారి అవసరాలపై వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఆయన టీమ్ ఆహార సరఫరా, వైద్య సహాయం, తాత్కాలిక ఆశ్రయాల ఏర్పాటుపై దృష్టి సారించింది. తక్షణ సహాయంతోనే తమ బాధ్యత ముగియదని, పునరావాస దశలో కూడా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటామని సోనూ సూద్ వెల్లడించారు.
సామాజిక సేవా కార్యక్రమాలతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్, కోవిడ్ సమయంలో వలస కార్మికులకు అందించిన సహాయంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అనంతరం కూడా పలు విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో తన ఫౌండేషన్ ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు నేపాల్ వరద బాధితుల కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు మరోసారి మానవతా కోణాన్ని చాటుతున్నాయి. రాబోయే నెలల్లో కూడా సహాయక సామగ్రి, పునరావాసానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన టీమ్ చెబుతోంది.








