అమితాబ్ కెరీర్ ఆరంభంలో అవమానాలు!
ఇండియన్ సినీ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(amitabh bachan) కెరీర్ ప్రారంభ రోజులు మాత్రం అంత సులభంగా సాగలేదు. ఐదు దశాబ్దాలకు పైగా ఆడియన్స్ ను అలరిస్తున్న ఆయన.. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి18(KBC18)లో తన సినీ జర్నీలోని కఠినమైన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. 2026 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లతో జరిగిన సంభాషణలో.. కెరీర్ తొలినాళ్లలో తాను కూడా తిట్లు, విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పారు. తనకు యాక్టింగ్ రాదని, చాలా పొడవుగా ఉన్నానని కొందరు వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు.
ఛాన్సులు వచ్చిన తర్వాత కూడా తనకు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోలేదని అమితాబ్ తెలిపారు. షూటింగ్ టైమ్ లో డైరెక్టర్లు తన యాక్టింగ్, డైలాగ్ చెప్పే విధానం, సీన్లో నిలబడే తీరుపై సూచనలు చేసేవారని గుర్తుచేసుకున్నారు. ఆ టైమ్ లో వచ్చిన ప్రతి సలహాను స్వీకరిస్తూ క్రమంగా తనను తాను మెరుగుపరుచుకున్నానని చెప్పారు. ఒకసారి షూటింగ్‌కు ఆలస్యంగా వెళ్లిన సందర్భాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. సొంత కారు లేని రోజుల్లో మరో వ్యక్తి వాహనంలో సెట్‌కు చేరుకోగా.. అప్పటికే డైరెక్టర్ షూటింగ్ ముగించుకుని బయటకు వచ్చి, వెళ్లిపోవాలని చెప్పిన ఘటనను అమితాబ్ ప్రస్తావించారు.
ప్రస్తుతం ఇండియన్ సినిమాకు అత్యంత గౌరవనీయమైన నటుల్లో ఒకరిగా నిలిచిన అమితాబ్ జర్నీ.. పట్టుదల ఉంటే ప్రారంభ వైఫల్యాలు, విమర్శలు కూడా ఫ్యూచర్ ను నిర్ణయించలేవని చెబుతుంది. నేర్చుకోవాలనే తపన, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆయన సాధారణ అవకాశాల నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారు. ఇదిలా ఉండగా కౌన్ బనేగా కరోడ్‌పతి 18 ఆగస్టు 10న ప్రారంభమైంది. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోనీ లివ్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది.








