అనిల్ నెక్ట్స్ మూవీ లైన్ విన్నా.. అదిరిపోయింది
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమాలో భాగ్యం పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తిరువీర్(Thiruveer)తో కలిసి నటిస్తున్న ఓ సుకుమారి(Oh Sukumari) టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె, తన సినీ ప్రయాణంతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో ఉన్న అనుబంధంపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తదుపరి సినిమాలో తనకు అవకాశం ఎందుకు రాలేదని ఓ విలేకరి ప్రశ్నించగా, సరదా ధోరణిలో స్పందించిన ఐశ్వర్యా.. ఆ విషయాన్ని నేరుగా అనిల్ నే ఫోన్ చేసి అడగాలని చెప్పి నవ్వులు పూయించారు. అనంతరం అనిల్‌పై తనకు ఉన్న గౌరవాన్ని వివరించారు.
భాగ్యం పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ తనకు ఎంతో ప్రత్యేకమని ఐశ్వర్యా పేర్కొన్నారు. అయితే ఆ సినిమా సక్సెస్ ను ఎప్పుడూ అనిల్ తన అకౌంట్ లో వేసుకోలేదని, తన టాలెంట్ ను ప్రోత్సహిస్తూ మాట్లాడటం అనిల్ రావిపూడి గొప్పతనమని ఆమె అన్నారు. వివిధ అవార్డు కార్యక్రమాల్లో ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, తన యాక్టింగ్ ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అవార్డు తనకే దక్కాలని అనిల్ చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు. ఒక డైరెక్టర్ తన నటీనటుల కృషిని ఈ స్థాయిలో గుర్తించడం అరుదైన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇదే సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం2(Sankranthiki vasthunnam2)పై కూడా ఐశ్వర్యా స్పందించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఉందని, కథ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని భావిస్తున్నానని చెప్పారు. మరోవైపు అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్(Venkatesh), కళ్యాణ్ రామ్(Kalyan Ram)లతో రూపొందిస్తున్న కొత్త సినిమాపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా స్టోరీ లైన్ విన్నానని, చాలా అద్భుతంగా ఉందని, మరో బ్లాక్ బస్టర్ రాబోతుందంటూ చెప్పిన ఐశ్వర్యా, భవిష్యత్తులో మరోసారి అనిల్ దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని, ఆ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని తాను కూడా కోరుకుంటున్నానని ఐశ్వర్యా తెలిపారు.








