‘టాక్సిక్’కు సెకండ్ ఛాన్స్?! ట్రిమ్ చేస్తే రిజల్ట్ మారుతుందా?
ఒక సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.కానీ రివ్యూలు తేడాగా వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఏదో లాగేసారు కానీ రోజులు గడిచేకొద్దీ బాక్సాఫీస్ వేగం తగ్గుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో అదే సినిమాను కొంచెం ట్రిమ్ చేసి, కొత్త వెర్షన్‌గా విడుదల చేస్తే పరిస్థితి మారుతుందా?
ఇప్పుడు యష్ నటించిన ‘టాక్సిక్’ విషయంలో జరుగుతున్న చర్చ ఇదే. ఎందుకీ చర్చ మొదలైంది. కొత్త వెర్షన్ రాబోతోందా అంటే..అవును , వెంటనే కాదు అని చెప్పాలి. ఎందుకంటే రిలీజైన భాషలకు కొత్త వెర్షన్ రావటం లేదు. ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అవుతూ కొత్త కట్ తో వస్తోంది. అదీ తేడా. అదెలా అంటే..
గత వారం విడుదలైన ‘టాక్సిక్’ సినిమా కేజీఎఫ్ స్టార్ యష్ కు ఉన్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్‌తో మొదలైంది. అయితే రెండో వారానికి వచ్చేసరికి వసూళ్ల వేగం బాగా తగ్గింది. ఇలాంటి సమయంలో మేకర్స్ ఇప్పుడు మరో వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
కొత్త ‘టాక్సిక్’లో 18 నిమిషాలు తక్కువ!
సెప్టెంబర్ 4న ‘టాక్సిక్’ ఇంగ్లిష్ వెర్షన్ ఇండియాలో విడుదల కానుంది. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న వెర్షన్ నిడివి దాదాపు 3 గంటల 14 నిమిషాలు. కానీ కొత్త ఇంగ్లిష్ వెర్షన్ మాత్రం సుమారు 2 గంటల 57 నిమిషాలు మాత్రమే. అంటే దాదాపు 18 నిమిషాలు తగ్గించారు.
ఇక్కడ మరో విషయం. ఇది కేవలం మరో భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్న వెర్షన్ కాదు. ‘టాక్సిక్’ను కన్నడతో పాటు ఇంగ్లిష్‌లో కూడా రూపొందించడంతో, ఇప్పుడు వస్తున్నది ప్రత్యేకమైన ఇంగ్లిష్ కట్‌గా మారింది.
ఆ 18 నిమిషాలు నిజంగానే తేడా చూపిస్తాయా?
సాధారణంగా ఏ సినిమాకైనా నిడివి చాలా కీలకమైన అంశం. కథ ఎంత బాగున్నా, అవసరానికి మించి సాగితే ప్రేక్షకుడి ఆసక్తి తగ్గిపోతుంది. అదే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే సినిమా వేగం మారొచ్చు.
దాంతో ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వెర్షన్ లో ఏ సన్నివేశాలు తొలగించారు? సినిమా ఇప్పుడు మరింత వేగంగా సాగుతుందా? కొత్త కట్ చూసిన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందా? ఇవన్నీ సెప్టెంబర్ 4 తర్వాతే తెలుస్తాయి.
ఇవి కూడా చదవండి
కొత్త వెర్షన్ క్లిక్ అయితే.. తర్వాత ఏంటి?
ఇక్కడే అసలైన ఇంట్రస్టింగ్ విషయం ఉంది. ఒకవేళ ఇంగ్లిష్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చి, తక్కువ నిడివితో సినిమా మరింత బాగా ఉందని ప్రేక్షకులు భావిస్తే, మేకర్స్ ముందు మరో ప్రశ్న వస్తుంది.
తెలుగు వెర్షన్‌ను కూడా మార్చాలా?
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లను కూడా ఇదే తరహాలో ట్రిమ్ చేసి విడుదల చేస్తారా? ఒకవేళ కొత్త కట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఖచ్చితంగా ఇప్పటికే విడుదలైన ఇతర భాషల వెర్షన్లపై కూడా మేకర్స్ కొత్తగా ఆలోచించే అవకాశం ఉంటుంది.
చివరికి తేలేదేంటి?
‘టాక్సిక్’ కొత్త ఇంగ్లిష్ వెర్షన్ కేవలం మరో భాషా విడుదల కాదు. అదే సినిమాను కాస్త కుదించి ప్రేక్షకుల ముందుకు పెడితే వారి అభిప్రాయం మారుతుందా అనే ఒక ఆసక్తికరమైన పరీక్ష.
అదే సినిమా.. అదే కథ.. కానీ 18 నిమిషాలు తక్కువ. మరి వెర్షన్ మారితే ప్రేక్షకుల తీర్పు, బాక్సాఫీస్ రిజల్ట్ కూడా మారుతుందా? దానికి సమాధానం కొత్త ‘టాక్సిక్’ వెర్షన్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది.అప్పుడు చాలా లెక్కలు మారచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








