సొంతింటి కలపై గ్లోబల్ వార్స్ ఎఫెక్ట్.. 25 శాతం పెరిగిన నిర్మాణ వ్యయం!
సొంతిల్లు (Own House) నిర్మించుకోవాలని, లేదా ఒక మంచి అపార్ట్మెంట్ కొనుక్కోవాలని కలలు కనే సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య రగులుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఇప్పుడు మన దేశ రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. గ్లోబల్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో నిర్మాణ వ్యయం (Construction Costs) ఏకంగా 25 శాతం మేర పెరిగిందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు ముప్పు అక్కడే!
ఈ ముంచుకొస్తున్న రియల్ ఎస్టేట్ సంక్షోభంపై ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా’ (CREDAI – క్రెడాయ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా సప్లై చైన్ (సరఫరా వ్యవస్థ) దారుణంగా దెబ్బతినడంతో, భవన నిర్మాణాలకు అత్యంత (Own House) అవసరమైన ముడిసరుకుల కొరత విపరీతంగా పెరిగిపోయిందని క్రెడాయ్ హెచ్చరించింది. ప్రధానంగా ఇనుము, స్టీల్, సిమెంట్, అల్యూమినియం, రాగి వంటి అత్యవసర నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కీలక ఎలక్ట్రానిక్ సామగ్రి, ఫిట్టింగ్స్ పోర్టుల్లోనే నిలిచిపోవడం, మరోవైపు ముడి చమురు సెగతో రవాణా ఖర్చులు డబుల్ అవ్వడం దేశీయ డెవలపర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
చేతులెత్తేస్తున్న బిల్డర్లు..
నిర్మాణ వ్యయం ఏకంగా 25 శాతంపైగా పెరిగిపోవడంతో బిల్డర్లు, డెవలపర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలా వరకు నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్ ప్రారంభంలో చేసుకున్న అగ్రిమెంట్ల ప్రకారం.. పాత ధరలకే ఇళ్లను (Own House) పూర్తి చేసి ఇవ్వలేక చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టును నష్టాలతో పూర్తి చేయలేక, పెరిగిన ఈ అదనపు ఖర్చుల భారాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలుదారుల (Homebuyers) పైనే మోపుతున్నారు. ఫలితంగా మార్కెట్లో కొత్త ఫ్లాట్లు, విల్లాల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. మరోవైపు ముడిసరుకు సకాలంలో సైట్లకు అందకపోవడం వల్ల ఇప్పటికే మొదలుపెట్టిన అనేక భారీ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో డెలివరీ సమయం కూడా తీవ్రంగా ఆలస్యమవుతోంది.
సామాన్యుడికి శాపంగా పరిస్థితులు..
ఒకవైపు ఇంధన ధరల మంట.. మరోవైపు ఏమాత్రం తగ్గని బ్యాంక్ వడ్డీ రేట్లు.. వీటికి తోడు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఈ స్థాయిలో పెరిగిపోవడం సామాన్యుల ఇంటి కలను (Own House) మరింత దూరం చేస్తోంది. అంతర్జాతీయంగా ఈ యుద్ధ మేఘాలు తొలగిపోయి, ప్రపంచ సరఫరా వ్యవస్థలు మళ్లీ గాడిన పడేంత వరకు రియల్ ఎస్టేట్ రంగానికి, సొంతిల్లు కొనుక్కునే సామాన్యుడికి ఈ కష్టాలు తప్పవని ఆర్థిక విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇల్లు కట్టడమైనా, కొత్తది కొనడమైనా సాహసమే అని తాజా నివేదికలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి







