డొనాల్డ్ ట్రంప్ కు 24 గంటలు అయితే.. జో బైడెన్ కు 5 నిమిషాలు చాలు!
తాను అధికారంలో ఉంటే 24 గంటల్లో రష్యా యుద్దానికి ముగింపు పలికేవాడినని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పటికీ ఏం చేయలేదనే విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు కేవలం ఐదు నిమిషాలు సరిపోతుందన్నారు. క్రిమియాపై 2014లో రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తు చేశారు. తదనంతరం డాన్బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు పోరాడుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయలేకపోయారని అన్నారు. యుద్ధం ముగింపునకు చొరవ చూపడం సంతోషించదగ్గ విషయమే. కానీ, అది వాస్తవికతపై ఆధారపడి ఉండాలి. ట్రంప్‌నకు ఈ 24 గంటల అవకాశం గతంలోనే వచ్చింది. క్రిమియా ఆక్రమణ క్రమంలో రష్యాతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో ఆయనకు ఆ అవకాశం వచ్చింది. కానీ, అప్పుడు ఆయనకు వేరే ప్రాధాన్యాలు ఉండొచ్చు అని ట్రంప్‌ను ఉద్దేశిస్తూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.






