FBI : అమ్మకానికి ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయ భవనం!

అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రధాన కార్యాలయ భవనాన్ని (FBI Headquarters) ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దాంతోపాటు ప్రధాన న్యాయ శాఖ భవంతి సహా సమాఖ్య ప్రభుత్వానికి చెందిన 443 ఆస్తులను విక్రయిస్తామని వెల్లడిరచింది. వాటికి ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రాధాన్యం లేదని తేల్చి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ సేవల పరిపాలన విభాగం ఓ జాబితాను ప్రకటించింది. వాటిలో దేశవ్యాప్తంగా పేరుగాంచిన భవనాలు, కోర్టు (Court) భవంతులు, కార్యాలయాలు, గ్యారేజీలు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీ (Washington DC )లో ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న జె.ఎడ్గార్ హూవర్ బిల్డింగ్, న్యాయ శాఖ భవంతి రాబర్ట్ ఎఫ్.కెన్నడీ, గతంలో ట్రంప్ ఓ హోటల్‌ను నిర్వహించిన ఓల్డ్ పోస్టాఫీసు బిల్డింగ్, అమెరికన్ రెడ్‌క్రాస్ (Red Cross) ప్రధాన కార్యాలయం, కార్మికశాఖ ప్రధాన కార్యాలయం, గృహ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయం సహా అనేక భవంతులు విక్రయానికి లేదా మూసివేయడానికి నిర్ణయించిన 443 ఆస్తుల జాబితాలో ఉన్నాయి.