బడ్జెట్ చీఫ్ గా నీరా టాండన్!
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాలనా బృందంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు లభించడం లాంఛనంగా కనిపిస్తోంది. బడ్జెట్ చీఫ్‌గా నీరా టాండన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ పొగ్రెస్ అనే మేథోసంస్థకు అధ్యక్షత వహిస్తున్న టాండెన్.. బైడెన్ బృందంలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ హోదాలో ఆమె బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే అనేక మంది ఆర్థిక నిపుణులు, సలహాదారులకు నేతృత్వం వహించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు సంబంధించి అధ్యక్షుడికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందజేస్తారు. ఒబామా హయాంలో టాండన్ హెల్త్‌కేర్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, 2016 డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రచార బృందంలోనూ పనిచేశారు.






