దేశవ్యాప్తంగా షట్‌డౌన్ ఉండదు : జో బైడెన్
అమెరికాలో దేశవ్యాప్త షట్‌డౌన్ విధించబోమని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సృష్టం చేశారు. కొవిడ్‌తో పోరులో భాగంగా మాస్కులను మాత్రం తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయ ప్రకటన కాదని, దేశం కోసం చేయాల్సిన విధిగా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలుగా ఉండటంతో దేశవ్యాప్త షట్‌డౌన్ అవసరం లేదన్నారు. వైరస్‌ను మాత్రం షట్ డౌన్ చేస్తామన్నారు. రెండు పార్టీల గవర్నర్ల బృందంతో సమావేశమైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మాస్కులను తప్పనిసరి చేసే విషయమై గవర్నర్లతో చర్చించినట్లు చెప్పారు. 10 మంది డెమొక్రటిక్, రిపబ్లికన్ గవర్నర్లు మాస్కులు పెట్టుకోవడాన్ని అమలు చేస్తున్నారని, దేశ్యాప్తంగా అమలు అవసరాన్ని కూడా వారంతా గుర్తించారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, వాటి విస్తీర్ణం, సమాజాలు భిన్నంగా ఉన్నాయి. అందువ్ల దేశవ్యాప్తంగా షట్‌డౌన్ విధిస్తే అది దేశ ఉత్పాదకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అని బైడెన్ చెప్పారు. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాలో ఎదురయ్యే సవాళ్లపై గవర్నర్లతో చర్చించినట్లు వెల్లడించారు. ఇందుకోసం ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు.






