అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత!
అమెరికాలో ఈ నెల 20న(బుధవారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు హింసాత్మక దాడులకు పాల్పడవచ్చన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తున్నారు. రాజధాని వాషింగ్టన్ నగరం పూర్తిగా భద్రతా దళాలతో నిండిపోయాయి. మరోవైపు అంతర్గత దాడులు జరగొచ్చన్న నిఘా హెచ్చరికలతో రక్షణ వర్గాల్లో ఆందోళన నెలకొన్నది. భద్రతా సిబ్బందిలోనే కొందరు దాడులకు దిగే ప్రమాదమున్నదన్న భయాల నేపథ్యంలో నిఘాను పటిష్టం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భద్రత కల్పించేందుకు వాషింగ్టన్కు వస్తున్న 25 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. అదివారం పలు రాష్ట్రాల్లో నిరసనకారులు తుపాకులు చేతబట్టి క్యాపిటల్ (చట్టసభలుండే)భవనాల వద్ద ఆందోళన చేపట్టారు.






